సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2023 (16:13 IST)

విమానంలో కొట్టుకున్న ప్రయాణికులు - అత్యవసర ల్యాండింగ్

flight
గగనతలంలో ప్రయాణిస్తున్న విమానంలో ప్రయాణికుల మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. దీంతో సమీప విమానాశ్రయంలో ల్యాండ్‌ అయింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో వెలుగుచూసింది. దీనికి సంబంధించి నలుగురు ప్రయాణికులను పోలీసులు అరెస్టు చేశారు. విమానం గాల్లో ఉండగానే యువతి యువకుల మధ్య వాగ్వాదం తలెత్తడంతో అత్యవసరంగా విమానాన్ని వెనుకకు మళ్లించాల్సి వచ్చింది. కెయిర్న్‌ నుంచి నార్త్‌ ఆస్ట్రేలియాకు వెళ్లే విమానంలో చోటు చేసుకున్న ఈ ఘటన వీడియో వైరల్‌గా మారింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. విమానంలో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికుల మధ్య గొడవ మొదలైంది. అది కాస్తా పెరగడంతో ఓ మహిళ గాజు సీసాతో మరో ప్రయాణికుడిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఒకరిని ఒకరు తోసుకోవటం, తన్నుకోవటంతో సిబ్బంది వచ్చి వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా వారు శాంతించలేదు. 
 
తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగటంతో విమానాన్ని క్వీన్స్‌ల్యాండ్‌‌కు మళ్లించారు. వారి మధ్య తగాదా సద్దుమణిగాక విమానం టేకాఫ్‌ అయ్యింది. కాసేపటికే వారు మళ్లీ గొడవకు దిగారు. వారి మధ్య వివాదం తారస్థాయికి చేరటంతో విమాన కిటికీతో పాటు కొన్ని వస్తువులు విరిగిపోయాయి. దీంతో తిరిగి విమానాన్ని సమీప ఎయిర్‌పోర్టులో దించివేశారు. దీంతోపాటు మరో ప్రయాణికుడు వద్ద మద్యం, మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు మొత్తం నలుగురు ప్రయాణికులను అరెస్ట్‌ చేశారు.