శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 6 ఏప్రియల్ 2023 (10:27 IST)

చనిపోతున్నానని తెలిసి మృతదేహం స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్న యువకుడు.. ఎక్కడ?

harshavardhan
మనసును ద్రవింపజేసే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తాను చనిపోతున్నానని తెలిసినప్పటికీ తన మృతదేహాన్ని స్వదేశానికి చేర్చేందుకు ఓ వ్యక్తి తాను జీవించివుండగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఫలితంగా అతను చనిపోయిన తర్వాత కోరుకున్నట్టుగానే మృతదేహం స్వదేశం, అక్కడ నుంచి స్వగ్రామానికి వచ్చి చేరింది. ఇంతకీ ఆ మృతుడి పేరు ఏపూరి హర్షవర్థన్ (33). తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కేంద్రం శ్రీనివాస నగర్‌ వాసి. బి ఫార్మసీ పూర్తి చేసిన హర్షవర్థన్.. ఉన్నత చదువు కోసం గత 2013లో ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడ బ్రిస్బేన్ యూనివర్శిటీలో హెల్త్ మేనేజ్‌మెంట్, జనరల్ మెడిసిన్ పూర్తి చేసిన తర్వాత క్వీన్స్‌లాండ్‌లోనవి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యుడిగా చేరాడు. 2020 ఫిబ్రవరి 20వ తేదీన ఖమ్మం వచ్చి వివాహం చేసుకున్నాడు. 
 
ఆ తర్వాత అక్టోబరులో వ్యాయామం చేస్తుండగా, దగ్గుతో పాటు ఆయాసం రావడంతో అనుమానంతో వైద్య పరీక్షలు చేయించుకుంటే ఊపిరితిత్తుల కేన్సర్ సోకినట్టు తేలింది. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు ఇంటికి రావాలని ప్రాధేయపడ్డాడు. కానీ, అక్కడే మంచి వైద్యం చేయించుకుంటూ ఉద్యోగం చేయసాగాడు. ఈ క్రమంలో తనకు సోకిన కేన్సర్ నయమయ్యే పరిస్థితి లేదని, చనిపోవడం ఖాయమని తెలుసుకున్న హర్షవర్థన్.. తొలుత తన భార్యకు విడాకులు ఇచ్చి, ఆమెను స్థిరపడేలా ఏర్పాట్లు చేశాడు. 
 
కేన్సర్‌కు చికిత్స చేయించుకున్న హర్షవర్థన్‌కు ఈ వ్యాధి నుంచి నయమైనట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో గత యేడాది సెప్టెంబరులో ఖమ్మం వచ్చి 15 రోజుల పాటు గడిపాడు. అయితే, ఆస్ట్రేలియాకు వెళ్లిన తర్వాత మళ్లీ తిరగబెట్టింది. ఈ దఫా చికిత్సకు లొంగలేదు. మరణం తప్పదని వైద్యులు తేల్చిచెప్పారు. అయినప్పటికీ హర్షవర్థన్ ఎక్కడా భయపడలేదు. ఆందోళన చెందలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు ఫోన్ చేస్తూ సంతోషంగా జీవితాన్ని గడిపాడు. 
 
అదేసమయంలో తాను చనిపోతే తన మృతదేహం స్వగ్రామానికి పంపించేందుకు అన్ని ఏర్పాట్లుచేశారు. ఇందుకోసం ఒక లాయర్‌ను కూడా నియమించుకున్నాడు. ఈ క్రమంలో గత నెల 24వ తేదీన హర్షవర్థన్ చనిపోయాడు. ముందుగా ఏర్పాట్లు చేసుకోవడంతో బుధవారం ఉదయం ఖమ్మంలోని ఆయన ఇంటికి హర్షవర్థన్ మృతదేహం వచ్చింది. కుమారుడి మృతదేహం చూసిన తల్లిదండ్రులు, సోదరులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆ తర్వాత బంధు మిత్రుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తిచేశారు.