శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 జూన్ 2021 (10:35 IST)

బిల్డ్‌ బ్యాక్‌ బెటర్‌ ... నేటి నుంచి జి-7 దేశాల శిఖరాగ్ర సదస్సు

బ్రిటన్ వేదికగా గ్రూపు-7 (జి-7) దేశాల శిఖరాగ్ర సదస్సు జరుగనుంది. ఈ సమావేశంలో బ్రిటన్‌, అమెరికా, ఫ్రాన్స్‌, ఇటలీ, జపాన్‌, కెనడా సభ్య దేశాలుగా ఉన్న కూటమి సమావేశాలు శుక్రవారం ప్రారంభంకానున్నాయి. ఈ యేడాది ఈ జీ7 సమ్మిట్‌ ‘బిల్డ్‌ బ్యాక్‌ బెటర్‌ (తిరిగి గొప్పగా నిర్మించుకుందాం) అనే థీమ్‌తో జరుగనుంది. భారత్‌, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికాలను అతిథ్య దేశమైన బ్రిటన్‌ ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించింది. 
 
కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రధాని ఇప్పటికే బ్రిటన్‌కు వెళ్లడం లేదని ఇప్పటికే విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. శని, ఆదివారాల్లో జరిగే జీ7 శిఖరాగ్ర సమావేశంలో వర్చువల్‌ విధానంలో పాల్గొంటారని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది.
 
కరోనా నుంచి ప్రపంచం మొత్తం బయటపడడమేకాకుండా భవిష్యత్తులో దాడి చేయబోయే మహమ్మారులను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండటం అందులో మొదటిది కాగా.. భవిష్యత్‌తరాల శ్రేయస్సు కోసం స్వేచ్ఛాయుతమైన, న్యాయబద్ధమైన వాణిజ్యాన్ని ప్రోత్సహించడం రెండోది. 
 
అలాగే వాతావరణ మార్పులను ధీటుగా ఎదుర్కొంటూ భూమిపై ఉన్న జీవవైవిధ్యాన్ని కాపాడడం మూడోది కాగా.. భాగస్వామ్య విలువలను రక్షించుకుంటూ స్వేచ్ఛాయుత సమాజాన్ని నెలకొల్పడం నాలుగో నినాదంగా బ్రిటన్ పేర్కొంది.
 
ఈ సదస్సులో పాల్గొనే దేశాలన్నీ ప్రపంచంలో నెలకొన్న కరోనా సమస్యలు, వాతావరణ మార్పులపై చర్చించి.. తమ ఆలోచనలను పంచుకోనున్నాయి. జీ-7 సమావేశాల్లో పాల్గొనడం రెండోసారి కాగా.. 2019లో జరిగిన సమావేశాలకు ఫ్రాన్స్, భారత్‌ను ఆహ్వానించింది. ఆ సమావేశాలకు హాజరైన ప్రధాని మోడీ.. వాతావరణ మార్పులు, సముద్రాల్లోని జీవవైవిధ్యం, సాంకేతిక పరివర్తన అంశాలపై ప్రసంగించారు.