మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 జూన్ 2021 (14:39 IST)

మా పెళ్లి చెల్లదు... విడిపోయాం.. ఆ వ్యక్తి గురించి ప్రశ్నించొద్దువ: టీఎంసీ ఎంపీ నుష్రత్ జహాన్

తన వివాహ బంధం తెగదెంపులపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సినీ నటి నుష్రత్ జహాన్ ఎట్టకేలకు నోరు విప్పారు. తుర్కిష్ చట్టాల ప్రకారం భారత్‌లో తమ పెళ్లి చెల్లుబాటు కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈమె నిఖిల్ జైన్‌ను వివాహం చేసుకున్నారు. అయితే, ఈ వివాహ బంధాన్ని ఆమె తెంచుకున్నారు. దీనిపై ఆమె బుధవారం ఓ ప్రకటన చేశారు. 
 
తన వారసత్వంగా వచ్చిన నగలు, ఆస్తులను అక్రమంగా లాగేసుకున్నారని, తన డబ్బులను అక్రమ మార్గాల్లో వాడుకున్నారని ఆరోపించారు. ఏడు భాగాలుగా తన ప్రకటనను వివరించారు.
 
తుర్కిష్ వివాహ చట్టాల ప్రకారం విదేశాల్లో చేసుకున్న పెళ్లిళ్లకు న్యాయ బద్ధత లేదు. అందునా మతాంతర వివాహం కావడం వల్ల.. భారత్‌లో దానికి చట్టబద్ధతనిచ్చే ప్రత్యేక వివాహ చట్టాలంటూ ఏమీ లేవు. చట్టం ప్రకారం అది అసలు పెళ్లే కాదు. 
 
కానీ, సహజీవనంతో సమానం. కాబట్టి విడాకులు అనే మాటే లేదు. మేము ఎప్పుడో విడిపోయాం. తన వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దన్న ఉద్దేశంతోనే రహస్యంగా ఉంచాను.
 
పని కోసం లేదా ప్రశాంతత కోసం ఒక్కదానినే వెళ్లాను. నాతో నేను విడిపోయిన వ్యక్తి రాలేదు. వాటికి ఖర్చులూ నేనే భరించాను.
నా సోదరి విద్యకయ్యే వ్యయాన్ని నేనే భరిస్తున్నాను. నా కుటుంబ బాధ్యతనూ చూసుకుంటున్నాను. మొదట్నుంచీ వారి బాధ్యత నేనే చూసుకుంటున్నాను. ప్రస్తుతం ఎలాంటి ‘సంబంధం’ లేని వ్యక్తి క్రెడిట్ కార్డులను వాడననడంలో అర్థం లేదు.
 
ధనవంతుడిని కాబట్టే నేను వాడుకున్నానని చెప్పిన ఆ వ్యక్తే.. నా బ్యాంకు ఖాతాల్లోని డబ్బును తీసుకున్నాడు. అర్థరాత్రిళ్లు తన ఖాతాల నుంచి అక్రమంగా డబ్బులు తీసుకున్నాడు. విడిపోయిన తర్వాత కూడా అది జరిగింది. దీనిపై బ్యాంకు అధికారులకు ఇప్పటికే ఫిర్యాదు చేశాను. త్వరలోనే పోలీసు కేసు కూడా పెడతాను.
 
నా దుస్తులు, బ్యాగులు, యాక్సెసరీలు ఇంకా వారి దగ్గర్నే ఉన్నాయి. నా తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు పెట్టిన బంగారు ఆభరణాలను వారి దగ్గరే పెట్టుకున్నారు. నేను కష్టపడి సంపాదించుకున్నదీ వారి దగ్గరే ఉంచుకున్నారు.
 
డబ్బున్నంత మాత్రాన ప్రతి మగాడూ బాధితుడు కాలేడు. మహిళను ఒంటరిని చేయలేడు. నా కష్టంతో నాకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాను.
 
నాకు సంబంధం లేని వ్యక్తులతో నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాల్సిన అవసరం ఇక ఏ మాత్రమూ లేదు. కాబట్టి నా జీవితంలో ఏ మాత్రం భాగం కానీ తప్పుడు వ్యక్తిని మీడియా ప్రశ్నించకూడదని కోరుతున్నా అంటూ ఆ నష్రత్ జహాన్ కోరారు.