గురువారం, 21 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 నవంబరు 2019 (18:29 IST)

పాక్‌లో కేజీ టమోటాల ధర రూ.400 : ఆ ద్రోహిని అప్పగిస్తే ఎగుమతి చేస్తాం...

భారత్‌లో ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి. అలాగే, దాయాది దేశం పాకిస్థాన్‌లో మాత్రం టమోటా ధరలు నింగిని తాకుతున్నాయి. ముఖ్యంగా, కిలో టమోటాలు రూ.400 మేరకు ధర పలుకుతోంది. పాకిస్థాన్ టమోటాలకు ఎక్కువగా భారత్‌పైనే ఆధారపడివుంది. ఇపుడు భారత్ నుంచి ఎగుమతులు నిలిచిపోవడంతో వీటి ధరలు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి. 
 
ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జబువా రైతు సంఘం నేతలు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఓ లేఖ రాశారు. పాకిస్థాన్‌లో టమోటా ధరలు దిగివస్తే కేవలం కూరగాయల ధరలు తగ్గడం మాత్రమే కాకుండా... ఇరు దేశాల మధ్య సారమస్య వాతావరణం కూడా ఏర్పడుతుందని సలహా ఇచ్చారు. 
వారు రాసిన లేఖలో మధ్యప్రదేశ్ నుంచి పాకిస్థాన్‌కు టమోటాలు పంపించాలంటే కొన్ని షరతులకు ఇమ్రాన్ ఒప్పుకోవాల్సిందేనని కూడా రైతులు సూచించారు. 'పారిపోయి వచ్చి పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను భారత్‌కు అప్పగించాలి. 26/11 ముంబై దాడులకు పాల్పడినందుకు క్షమాపణ చెప్పాలి' అని రైతులు తేల్చిచెప్పారు. పాకిస్థాన్‌లో కిలో టమోటా ధర రూ.400 మేర పలుకుతున్న నేపథ్యంలోనే రైతులు ఇలా స్పందించడం విశేషం. 
 
గత కొన్నేళ్లుగా జబువాలోని పలు తహశీళ్ల నుంచి ప్రత్యేకించి పెట్లవాద్ నుంచి పాకిస్థాన్‌కు విరివిగా టమోటాలు ఎగుమతి అవుతున్నాయి. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడికి నిరసనగా రైతులు పాకిస్థాన్‌కు టమోటా ఎగుమతి నిలిపివేశారు. కాగా రెండ్రోజుల క్రితం మధ్యప్రదేశ్ రైతులు 'పీవోకే ఇచ్చేయ్... టమోటాలు తీసుకెళ్లు' అన్న నినాదంతో ఆందోళన కూడా నిర్వహిచడం మరో విశేషం.