9/11 దాడులు.. మా దేశంలోనే నిందితులు.. కనిపెట్టలేకపోయారు.. ముషారఫ్
పాకిస్థాన్‌లో తిరిగి అధికారం కోసం మాజీ నేత ముషారఫ్ వీడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది. పాకిస్థాన్‌లో తాను తిరిగి అధికారాన్ని పొందేందుకు అమెరికా సహకరించాలని కోరుతున్న మాజీ నేత ముషారఫ్ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఈ వీడియోలో అమెరికా మద్దతిస్తే తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడం తనకు సులభమేనని తెలిపారు. దీన్ని ఎప్పుడు చిత్రీకరించారో తెలియదుగానీ, పాకిస్థానీ కాలమిస్ట్ గుల్ బుఖారీ దీన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఈ వీడియోలో అమెరికా ఇచ్చిన డబ్బుతోనే పాకిస్థాన్ టెర్రరిజంపై పోరాడుతోందని చెప్పారు. తన హయాంలో పేదరికాన్ని 34 శాతం నుంచి 17 శాతానికి తగ్గించామని ఆ వీడియోలో వెల్లడించారు. ఒసామా బిన్ లాడెన్ పాకిస్థాన్‌లో ఉన్నా కనుగొనడంలో విఫలమైన మాట నిజమేనని చెప్పుకొచ్చారు.
ఈ విషయంలో ఐఎస్ఐని క్షమించవచ్చని ముషారఫ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 9/11 దాడుల విషయంలో తమ దేశంలోనే నిందితులు ఉన్నా అమెరికా ఇంటెలిజెన్స్ కూడా పసిగట్టలేకపోయిందని ముషారఫ్ వ్యాఖ్యానించారు.