మరికొన్ని రోజుల్లోనే విశాఖ నుంచి పాలన : మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి
మరికొన్ని రోజుల్లో సీఎం జగన్ వైజాగ్ నగరానికి షిఫ్ట్ అవుతున్నారని, విశాఖ నుంచి పాలన సాగించే రోజులు నెలల నుంచి రోజుల్లోకి వచ్చిందని రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో సీఎం జగన్ బ్రాండ్ స్పష్టంగా కనిపించిందన్నారు. ఈ సదస్సు గురించి ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారన్నారు.
ఈ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా దాదాపు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 352 ఎంవోయులు జరిగాయని తెలిపారు. తద్వారా 6 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు పడ్డాయని చెప్పారు. దేశంలోనే అధిక వనరులు ఉన్న విశాఖ నగరం మనకు ఉండటం ఎంతో అదృష్టమన్నారు.
పెట్టుబడుల సదస్సు తర్వాత అయినా ప్రతిపక్ష పార్టీలో మార్పు వస్తుందని అనుకుంటున్నామని చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా విండ్ లేదా సోలార్ పవర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి అమర్నాథ్ సలహా ఇచ్చారు. రాబోయే రోజుల్లో సీఎం జగన్ వైజాగ్ వస్తారని మంత్రి చెప్పారు.
గతంలో డిల్లీలో స్వయంగా జగనే ఈ విషయాన్ని చెప్పారని వివరించారు. విశాఖకు జగన్ వచ్చే సమయం నెలల నుంచి రోజుల్లోకి వచ్చేసిందని చెప్పారు. అనుకున్న సమయానికంటే ముందే విశాఖ నుంచి పాలన సాగబోతుందని మంత్రి అమర్నాథ్ వివరించారు. తదుపరి ప్రపంచ ఐటీ హబ్ విశాఖపట్టణమేనని ఆయన జోస్యం చెప్పారు.