గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2019 (17:17 IST)

భర్త పబ్‌జీ గేమ్ ఆడనివ్వలేదని భార్య ఏమి చేసిందో తెలుసా?

ప్రస్తుతం పబ్‌జీ గేమ్ డ్రగ్స్ కంటే మరింత డేంజర్‌గా తయారైంది. ఆ మాయదారి ఆట మత్తులో పడి చిన్నారులు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. మద్యం, డ్రగ్స్, ధూమపానం కంటే ఇప్పుడు పబ్‌జీ గేమ్ పేరు చేబితేనే తల్లిదండ్రులు హడలెత్తిపోతున్నారు. పబ్‌జీ గేమ్ రాకముందు పిల్లలు, యూత్ మొబైల్ గేమ్స్ ఆడుతుండేవారు. 
 
అయితే ఇది వచ్చాక చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ పబ్జీ మాయలో మునిగితేలుతున్నారు. దీంతో కొన్నిదేశాల్లో ఈ గేమ్‌పై బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల యూఏఈలోని అజ్మన్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
 
కట్టుకున్న భర్త తనను పబ్జీ గేమ్ ఆడుకోనివ్వడం లేదంటూ 20 ఏళ్ల మహిళ నేరుగా అజ్మన్ పోలీసుల శాఖకు చెందిన సోషల్ సెంటర్‌కు వెళ్లి తనకు వెంటనే విడాకులు ఇప్పించమని కోరింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఖంగుతిన్నారు. వెంటనే భర్తకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్‌కి పిలిపించి మాట్లాడారు. భర్త తన స్వేచ్ఛను హరిస్తున్నాడని యువతి పోలీసులకు వివరించింది. 
 
కాగా ఆమె కుటుంబ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించాలనే తాను అలా చేశానని భర్త సమాధానమిచ్చాడు. భార్యభర్తలకు సర్ది చెప్పేసరికి పోలీసుల తల ప్రాణం తోకకు వచ్చినట్లయింది. చివరకు పోలీసులు నచ్చజెప్పడంతో వారిద్దరూ తమ ఇంటికి వెళ్లిపోయారు. 
 
ఇలాగే ఓ మహిళ తన 13 ఏళ్ల కొడుకు పబ్‌జీ గేమ్‌కు బానిసయ్యాడని ఫిర్యాదు చేసింది. అయితే ఈ గేమ్ ఆడకుండా ఫోన్ లాక్ చేయడం వల్ల ఆ కుర్రాడు తీవ్రమైన మానసిక క్షోభకు గురై మంచానపడ్డాడని అధికారులు వెల్లడించారు. అయితే ఎన్నో కేసులు డీల్ చేసిన పోలీసులు ఓ గేమ్ కారణంగా ఇన్ని తలనొప్పులు ఎదుర్కోవడం ఇదే తొలిసారంటూ వాపోతున్నారు.