ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 14 నవంబరు 2020 (15:29 IST)

మౌనాన్ని వీడిన ట్రంప్, బైడెన్‌ను కుర్చీపైన కూర్చోనివ్వరా? ట్రంప్ ప్లానేంటి?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ డొనాల్డ్ ట్రంప్ ఇంతవరకు తన ఓటమని అంగీకరించని సంగతి తెలిసిందే. తాజాగా ఆయన తన మౌనాన్ని వీడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోజ్ గార్డెన్లో కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అధ్యక్ష బాధ్యతలను ఎవరు స్వీకరించబోతున్నారో ఎవరు ఊహించగలరు? అని అన్నారు.
 
సమయమే అన్నింటికీ సమాధానం చెపుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత శుక్రవారం కూడా ఎన్నికలకు సంబంధించి ఆయన ఓ ట్వీట్ చేశారు. ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. మరోవైపు, ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీ చేస్తున్న ఆరోపణలను మిచిగాన్‌కు చెందిన ఓ జడ్జి ఖండించారు. ఎన్నికల ప్రక్రియ సవ్యంగా జరిగిందని ఆయన అన్నారు.
 
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ట్రంప్ దాదాపుగా మౌనంగానే ఉన్నారు. అధ్యక్ష బాధ్యతలకు కూడా ఆయన దాదాపుగా దూరంగానే ఉంటున్నారు. బహిరంగంగా ఆయన కనిపించలేదు. పెరుగుతున్న కరోనా కేసులు, మరణాల గురించి ఆయన మాట్లాడలేదు. ఏదేమైనప్పటికీ తాజాగా 'సమయమే అన్నింటికీ సమాధానం చెపుతుంది' అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
 
బైడెన్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించకుండా చేయడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించాలో... అన్నీ ట్రంప్ చేస్తున్నారనే విషయం స్పష్టమవుతోందని విశ్లేషకులు చెపుతున్నారు. జనవరి 20న అమెరికా కొత్త అధ్యక్షుడు బాధ్యతలను స్వీకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.