'హార్ట్ ఎటాక్' టైంలో నీ ఫేవరేట్ హీరోయిన్స్ ఎవరు అంటే సమంత, నిత్యమీనన్ పేర్లే చెప్పాను. అలాంటిది 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలో వారిద్దరితో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది. సమంత కమర్షియల్ హీరోయిన్‌గా ఒక మార్క్ క్రియేట్ చేసింది. తనన్నా, తన వస్త్రధారణ అన్నా నాకు చాలా ఇష్టం'' అని ఆదాశర్మ చెప్పింది.
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్.రాధాకృష్ణ నిర్మించిన సన్నాఫ్ సత్యమూర్తిలో ఆమె నటించింది. ఈ సందర్భంగా ఆమెతో చిట్‌చాట్..
* మీకెలాంటి రెస్పాన్స్ వచ్చింది?
నేను నటించిన 'హార్ట్ ఎటాక్' సినిమా ఆడియో ఫంక్షన్‌లో త్రివిక్రమ్, హరీష్ శంకర్, రాజమౌళి వంటి దర్శకులతో పని చేయాలనుందని చెప్పాను. నేను అనుకున్న మొదటి సంవత్సరంలో త్రివిక్రమ్ గారితో సినిమా చేసే అవకాశం వచ్చింది. రిలీజ్ తర్వాత అందరూ బాగుందని చెబుతున్నారు. అంతకంటే ఏం కావాలి.
* పూర్తిస్థాయి హీరోయిన్‌కాని పాత్రల్లో చేశారు?
ఎంత నిడివి అనేది ముఖ్యంకాదు. కథలో పాత్ర ఎంత ప్రాధాన్యం అనేది చూస్తాను. ఎంతో ప్యాషన్‌తో ఫిలిం ఇండస్ట్రీలో అడుగు పెట్టాను. క్యారెక్టర్ నచ్చితే ఖచ్చితంగా ఏ పాత్రలో అయినా నటిస్తాను. ఈ సినిమాలో నేను నటించిన పల్లవి అనే
పాత్రకు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు.
* ఇప్పటి హీరోయిన్లు ఐటంసాంగ్‌లు, ఎక్స్‌పోజింగ్‌లు చేస్తున్నారు?
ఇతరుల గురించి చెప్పను. నా గురించి అయితే కథలో భాగంగావుండే పాటకు ఓకే. ఎక్స్‌పోజింగ్ అనేది పెద్దగా చూడాల్సిన పనిలేదు. అదికూడా నటనలో ఓ భాగమే. కానీ ఇక్కడ దాన్ని ప్రత్యేక కోణంలో చూడ్డం అశ్చర్యమేస్తుంది.
* అల్లు అర్జున్‌తో నటించడం ఎలా అనిపించింది?
అల్లు అర్జున్ డాన్స్, ఎక్స్‌ప్రెషన్స్ అద్భుతం. చాలా బాగా నటిస్తాడు. చిన్న బీట్ కూడా మిస్ చేయకుండా చేస్తాడు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. అల్లు అర్జున్‌తో ఇంకెవరిని కంపేర్ చేయలేము.
* మీరు అనుకున్న పాత్ర వచ్చిందా?
ప్రతి రోజు కొత్తగా ఉండాలనుకుంటాను. నేను ఇప్పటి వరకు నటించిన మూడు సినిమాలలో మూడు డిఫరెంట్ పాత్రల్లో నటించాను. ఒకటి హార్రర్ అయితే మరొకటి ఎమోషనల్ రోల్. ఒకేలాంటి పాత్రల్లో నటించడం నాకు నచ్చదు.
* మీరు చేసిన రెండు చిత్రాలు వేర్వేరు భాషల్లో విడుదలకావడం ఎలా వుంది?
* సన్నాఫ్ సత్యమూర్తితో పాటు కన్నడలో 'రానా విక్రమ' ఒకే రోజు విడుదలయ్యాయి. రెండు సినిమాలకు మంచి రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు హార్ట్ ఎటాక్‌తోపాటు, 'హసీతో ఫసీ' కూడా ఒకేరోజు విడుదలయ్యాయి.
* కొత్త చిత్రాలు?
సుబ్రహణ్యం ఫర్ సేల్‌లో పల్లెటూరి అమ్మాయిగా చేస్తున్నా. హీరో ఆదితో 'గరం' సినిమాలో నటించనున్నాను. పి.వి.పి బ్యానర్‌లో మరో సినిమా ఒప్పుకున్నాను.
* కన్నడలో కూడా అవకాశాలు వస్తున్నాయి... విమర్శలు ఎలా తీసుకుంటారు?
అవి వినడానికి చాలా ఫన్నీగా వుంటాయి. సీరియస్‌గా చూస్తే చాలా బాధేస్తుంది. విమర్శ అనేది పాజిటివ్‌గా తీసుకునే అలవాటు చేసుకుంటాను. అని ముగించారు.