మా ఇంటికి చాలామంది శ్రేయోభిలాషులు నిర్మాతలు వచ్చేవారు. నాకంటే మా అన్నయ్య బాగుంటాడు. హీరోగా రాణిస్తాడు. నువ్వేంటి హీరో.. ఓసారి అద్దం చూసుకున్నావా! అంటూ 'అల్లరి' సినిమా టైంలో అన్నారు. అప్పుడు రెండుమూడు సినిమాలు చేస్తేచాలు అనుకున్నా.. కానీ ఇప్పటికి 50 సినిమాలు చేశాను.. అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు అల్లరి నరేష్. మోహన్‌బాబుతో కలిసి మామ మంచు అల్లుడు కంచు సినిమా చేశారు. ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్బంగా నరేష్‌తో చిట్‌చాట్.
మీకు టైమ్‌సెన్స్ లేదని కొన్ని సంఘటనలు చెబుతున్నాయి?
షూటింగ్‌లో 7 గంటలకు షాట్ అంటే 7గంటలకు ముందే వుంటాను. కానీ కొన్నిచోట్ల కొన్ని పనులకు వెళ్లడంతో ఆలస్యం కావడంతో ఒక్కోసారి లేట్ అవుతుంది. మొన్న విలేకరులను పిలిచి రెండుగంటల పాటు రాలేదు. అందుకు సారీ చెబుతున్నాను. మా బాబాయ్ ఇంటిలో ఫంక్షన్ వుండటంతో రావడానికి లేట్ అయింది. ఆ విషయం తెలీక.. వారు నా ప్రెస్‌మీట్‌ను బాయ్‌కాట్ చేశారు.
అల్లరితో మొదలైన కెరీర్.. 50దాకా వస్తుందని అనుకున్నారా?
లేనేలేదు. అల్లరి సినిమాలో చాలా ఫేస్ చేశాను. నాన్నగారి దగ్గరికి చాలామంది దర్శకులు నిర్మాతలు వచ్చేవారు.. అన్నయ్య బాగుంటాడు. నువ్వు ప్రొడక్ష్ చూసుకో అనేవారు. కొందరైతే.. నువ్వు హీరో అటగా.. ఒక్కసారి అద్దంలో చూసుకున్నావా? అనేవారు. ఇంకొందరైతే.. నాన్నగారు బాగా సంపాదించారు. అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వకూడదా అనేవారు. ఏదిఏమైనా.. రవిబాబు ఇచ్చిన ప్రోత్సాహంతో అల్లరి సినిమా చేశాను. దాన్ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారు. కానీ ఇన్ని సినిమాలు చేస్తానని అనుకోలేదు. ఏవో ఐదు సినిమాలు చేస్తే చాలు అనిపించింది.
మామ అల్లుడి కథలు చాలా వచ్చాయిగదా?
వాటికి దీనికి తేడా వుంది. మామను అల్లుడు ఏడిపించడం అనేది మామూలు. కానీ ఇందులో మామ అల్లుళ్ల మధ్య టామ్ అండ్ జెర్రీలా పోటీ వుంటూనే.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. మా ఇద్దరి కాంబినేషన్ సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి.
మోహన్ బాబుగారితో నటించడం భయమనిపించలేదా?
మోహన్‌బాబు గారితో కలిసి యాక్ట్ చేసేప్పుడు నేనెప్పుడూ భయపడలేదు. అందుకు కారణం ఆయనంటే నాకు భయం లేదు, గౌరవం ఉంది. ఒక ఆర్టిస్ట్ గానే కాకుండా ఓ వ్యక్తిగా మోహన్‌బాబు గార్ని నేను అభిమానిస్తాను.
హీరోగా నిలబడాలనే వచ్చారా? దర్శకత్వం చేస్తారా?
నేను కూడా హీరో అవుదామని రాలేదు. నిజానికి నేను 'రఘువరన్'గారిలా విలన్ అవుదామనుకున్నాను. కానీ 'కితకితలు' సినిమా చేసాక 'నేను కూడా హీరోగా చేయొచ్చు' అన్న నమ్మకం కలిగింది.
ఈ మధ్య సినిమాలు తగ్గించారే.. కారణం?
ఇంతకుముందుతో పోల్చితే ఈమధ్య సినిమాలు తగ్గించాను. అయితే.. దానికి కారణం ఏంటంటే.. ఒక అనుభవం ఉన్న నిర్మాత సినిమాను నిర్మించడానికి ఎంత జాగ్రత్త తీసుకొంటాడో.. సినిమాను ప్రమోట్ చేయడానికి కూడా అదే స్థాయిలో జాగ్రత్తపడతాడు. కానీ కొత్త నిర్మాతలు అలా కాదు.. ఇక కొత్త దర్శకులతో రిస్క్ ఎక్కువ. అందుకే ఈమధ్య సినిమాలు తగ్గాయి. ఏదో ఒకటి చేసేయాలని అనుకోవట్లేదు. నా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకూడదన్నదే నా అభిమతం.
'సుడిగాడు' తర్వాత పారితోషికం పెంచారని తెలిసింది?
ఆ వార్త నావరకు వచ్చింది. కానీ.. నేనేమి నాకు ఎక్కువ డబ్బులు ఇవ్వండి అనలేదు. సినిమా కోసం కొంచెం ఎక్కువ ఖర్చు చేయండీ.. దాన్నిబట్టి సినిమా స్థాయి కూడా పెరుగుతుంది అన్న ఆలోచనతోనే అన్నాను. ఉదాహరణకు.. నేను నటించిన ఆ సినిమా 8 కోట్ల రూపాయలతో నిర్మించారు.. దాదాపు 15 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. సో, తరువాత సినిమాకి ఇంకొంచెం ఎక్కువ ఖర్చు చేస్తే.. మరింత లాభాలు వస్తాయన్నదే నా ఆలోచన తప్పితే.. డబ్బు సంపాదించేసుకోవాలని కాదు.
తండ్రిని మిస్సయినట్లు అనిపించిందా?
అప్పట్లో రాజేంద్రప్రసాద్, జంధ్యాల కాంబినేషన్ ఎలా సింక్ అయ్యిందో, అదే స్థాయిలో అల్లరి నరేష్, ఇవివి సత్యనారాయణ కాంబినేషన్ సింక్ అయ్యింది. అందుకే ఆయన మరణించాక.. ఒక తండ్రిగానే కాక దర్శకుడిగానూ ఆయన్ను మిస్సవుతుంటాను.
మీ భార్య ప్రమేయం కథల్లో ఎంత మేరకు వుంటుంది.
తను పెద్దగా కలుగచేసుకోదు. నా భార్య ఆర్కిటెక్. తన ఉద్యోగం ధ్యాసలో తను ఉంటుంది. అందువల్ల నా సినిమా గురించి పెద్దగా పట్టించుకోదు. నేను నటించిన సినిమాల్లో ఆమె చూసింది ''జేమ్స్ బాండ్'' మాత్రమే. మరి భవిష్యత్‌లో ''ఇలాంటి సినిమాలు చేయండి, అలాంటి సినిమాలు చేయండి'' అని చెప్పొచ్చేమో. పల్లెటూరి నేపధ్యంలో ఓ సినిమా చేయాలనుంది.
సొంతబేనర్‌లో తీసిన 'బందిపోటు'లో లోపం ఎక్కడుందంటారు?
తీసుకున్న కథ మంచిదే. కానీ విధానంలో తడబడ్డాం. నానుంచి ప్రేక్షకులు పూర్తి కామెడీ ఆశించారు. సెటిల్ కామెడీ కోరుకోలేదు. చాలామంది బి,సి. సెంటర్లకే నరేష్ పరిమితం. 'ఎ' సెంటర్ ఆడియన్స్ చేరువకాలేకోతున్నారంటూ.. మల్టీప్లెక్స్ సినిమా ట్రైచేయమని సూచించారు.
మళ్ళీ మీ బేనర్‌లో సినిమా ఎప్పుడు?
ప్రస్తుతం ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా మొదలుకానుంది. ఆ తర్వాత నాగేశ్వర్రెడ్డి, శ్రీనివాసరెడ్డిలతో సినిమాలున్నాయి. ఈ మూడు సినిమాలు పూర్తయ్యాక.. మా 'ఇవివి సినిమా' బ్యానర్‌లో నాన్నగారి శైలి పల్లెటూరి కామెడీ సినిమా ఒకటి చేయాలనుందని చెప్పారు.