శనివారం, 24 జనవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: గురువారం, 30 జులై 2015 (20:09 IST)

అనుష్క కంటే సాక్షి బెటర్‌ ఛాయిస్‌.. బాహుబలి మెస్మరైజ్... అనిల్‌ సుంకర

14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మహేష్ బాబుతో '1' నేనొక్కడినే, 'దూకుడు' సినిమాలు తీసిన అనిల్‌ సుంర.. తర్వాత ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై యాక్షన్‌ 3డి, ఇప్పుడు అల్లరి నరేష్‌తో జేమ్స్‌బాండ్‌ చిత్రాన్ని తీశాడు. ఈ జేమ్స్‌బాండ్‌ చిత్రం బాగా ప్రేక్షకుల ఆదరణ పొందుతోందని ఇటీవలే విజయ యాత్ర కూడా వెళ్ళి వచ్చామని చెబుతున్నారు. ఈ చిత్రంలో నరేష్‌కు జోడీగా అనుష్కను అనుకున్నారు. కానీ ఆమె కంటే సాక్షినే బెటర్‌ అంటున్నారు. ఏమిటా విషయాలు.. ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..
 
జేమ్స్‌ బాండ్‌.. నేను కాదు నా పెళ్ళాం సినిమా ఎటువంటి ఫలితాన్ని ఇచ్చింది? 
నరేష్‌ గత సినిమాల కంటే ఎక్కువ కలెక్ట్‌ చేస్తుంది. ఈ విజయాన్ని ముందుగానే ఊహించాం. కానీ, 'బాహుబలి' టైంలో విడుదల చేయడం పెద్ద రిస్క్‌ అని చాలామంది అన్నారు. అప్పటికే రెండు వారాలు ఆగాం. ఇక లాభం లేదని రిలీజ్‌ చేశాం. మా అంచనాలు ప్రేక్షకులు రిసీవ్‌ చేసుకున్నారు.
 
సినిమా చాలా తక్కువలో తీసినట్లు కన్పిస్తుంది?
లో-బడ్జెట్‌ సినిమానే ఇది. ప్రమోషన్‌ ట్రైలర్స్‌ విడుదలయ్యాక.. మాఫియా ఎపిసోడ్‌ దుబాయ్‌.. పాటలు.. సీన్స్‌ అన్ని చూసి.. ఎందుకు అంత ఖర్చు చేశావ్‌ అని సన్నిహితులు అడిగారు. కానీ అదంతా సీజీ వర్కే.. అసలు ఈ సినిమా కోసం దుబాయ్‌ వెళ్ళనేలేదు. 
 
ఇంత మాయ చేస్తే.. ప్రేక్షకులు మీ రాబోయే సినిమాలపై దురభిప్రాయం ఏర్పర్చుకుంటారేమో?
అలా జరుగదు.. బాహుబలి వంటి చిత్రాలే రకరకాలుగా తీస్తూ మెస్మరైజ్‌ చేస్తున్నారు. ఒక రకంగా అలాంటి సినిమా తీయడం మళ్ళీ కష్టమే. అయినా ప్రేక్షకులు ఇది దుబాయ్‌ కాదు అని అనరు.. నిజంగానే దుబాయ్‌లో తీసినట్లుంటుంది.
 
మొదట అనుష్క అనుకున్నారు. తర్వాత సాక్షి చౌదరిని తీసుకున్నారు..?
అవును.. అనుష్క కంటే మాకున్న ఛాయిస్‌లో సాక్షి చౌదరి ది బెస్ట్‌. కొన్ని కారణాల వల్ల ఆమె చేయలేకపోయింది. అందుకే సాక్షిని తీసుకున్నాం. డాన్‌ బుల్లెట్‌ పాత్రలో చాలా బాగా నటించింది. ముఖ్యంగా యాక్షన్‌ సన్నివేశాలు బాగా చేసింది. ప్రేక్షకుల నుండి కూడా ఆమె నటనకు మంచి స్పందన లభిస్తుంది. సాక్షి చౌదరి నటనతో చాలా హ్యాపీగా ఉన్నాం.  
 
కొరియన్‌ మూవీ కాపీ అని వార్తలు వచ్చాయి?
'మై వైఫ్‌ ఈజ్‌ గ్యాంగ్‌‌స్టర్‌' సినిమాలో పాయింట్‌ ఒక్కటే తీసుకున్నాం. ట్రీట్మెంట్‌ అంతా కొత్తగా ఉంటుంది. ఒకవేళ రెండు సినిమాలను ప్రేక్షకులు చూస్తే ఆ విషయం అర్థం అవుతుంది. సన్నివేశాలు, క్లైమాక్స్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. 
 
యాక్షన్‌ 3డి అంటూ దర్శకత్వం చేపట్టారు. అది ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది?
ఓ తప్పు చేశాను. జీవితంలో మరోసారి చేయకూడదని నిర్ణయం తీసుకున్నాను. యాక్షన్‌ 3డి అనుకోకుండా చేసిన సినిమా. ఆ కథ, కామెడీని 3డిలో చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ సినిమా చేశాం. అప్పట్లో 3డి సినిమాలు ప్రదర్శించే థియేటర్లు 25 నుంచి 30 మాత్రమే ఉన్నాయి. ప్రేక్షకులు 3డి సినిమా ఆశిస్తే 2డి కనిపించింది. ఆ సినిమా పరాజయానికి చాలా కారణాలు ఉన్నాయి. 
 
మళ్లీ దర్శకత్వం వహించే ఆలోచన ఉందా..?
తప్పకుండా. ఓ మంచి స్క్రిప్ట్‌ లభించిన తర్వాత దర్శకత్వం వహిస్తా. ఈసారి విమర్శకులు నోరెళ్ళబెట్టే సినిమా తీస్తా. ప్రస్తుతం అటువంటి స్క్రిప్ట్‌ కోసం వర్క్‌ చేస్తున్నాం. 
 
మహేష్‌ బాబుతో సినిమా అన్నారు..?
కొందరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. మహేష్‌ బాబుతో సినిమా చేయడానికి ఎప్పుడైనా రెడీ. కానీ, మంచి కథ దొరకాలి. 'ఆగడు'పై అంచనాలు ఎక్కువ కావడంతో అభిమానులను నిరాశ పరిచింది. మళ్లీ 'దూకుడు' రేంజ్‌ విజయం ఇవ్వగలిగిన స్క్రిప్ట్‌ దొరికినప్పుడు మహేష్‌ బాబుతో సినిమా చేస్తాం. వచ్చే ఏడాది తప్పకుండా వుంటుంది.
 
14రీల్స్‌ నుంచి విడిపోయి కొత్తగా బేనర్‌ పెట్టారా?
ముగ్గురు స్నేహితుల కలిసి 14రీల్స్‌ పెట్టాం.. రవి ఆచంట, నేను, గోపీ కలిసి స్థాపించాం. అది అదే ఇది ఇదే.. లో బడ్జెడ్‌ చిత్రాలు ఎకె ఎంటర్‌టైన్మెంట్స్‌లో తీయాలనుకుంటున్నాం.
 
పెద్ద సినిమా, చిన్న సినిమా.. ఏది నిర్మించడం కష్టం?
దేనిలో ఉండే కిక్‌ దానిలో ఉంటుంది. ఓ పెద్ద సినిమా తీస్తే స్టార్‌ హీరో, టెక్నీషియన్లు ఆ కళ వేరు. చిన్న సినిమాకు తేడా వస్తే అందరూ నిర్మాతను నిందిస్తారు. కానీ, లో-బడ్జెట్‌లో సినిమా తీయడం వలన పెద్ద సినిమాలు నిర్మించడం ఈజీగా అనిపిస్తుంది. తక్కువ నిర్మాణ వ్యయంలో మంచి సినిమా నిర్మించడం ఎంతో సహాయపడుతుంది.               
 
నిర్మాతకు విజయం, వసూళ్లు రెండిటిలో ఏది ముఖ్యం..?
రెండూ ముఖ్యమే. 'బిందాస్‌' విజయం సాధించింది. పెట్టుబడి వెనక్కు తిరిగి రాలేదు. మొదటి సినిమా కావడంతో కొంత అవగాహనాలేమితో ఎక్కువ ఖర్చు చేశాం. అదే సినిమా ఇప్పుడు చేస్తే, సగం బడ్జెట్లో చేయొచ్చు. పరిశ్రమలో నిలబడటానికి అప్పుడు విజయం ముఖ్యమని భావించా. ఇప్పుడు విజయంతో పాటు డబ్బులు కూడా ముఖ్యమే. 
 
తదుపరి చిత్రాలు?
14 రీల్స్‌ ఎంటర్టైన్మెంట్స్‌ పతాకంపై నాని హీరోగా హను రాఘవాపూడి దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. సునీల్‌ హీరోగా గోపీమోహన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాం. ఏకే ఎంటర్టైన్మెంట్స్‌ పతాకంపై నిర్మించబోయే చిత్రం వివరాలను మరో మూడు నెలల తర్వాత ప్రకటిస్తాను అని చెప్పారు.