శుక్రవారం, 23 జనవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: గురువారం, 3 డిశెంబరు 2015 (20:04 IST)

తెలంగాణ వాడిననే వివక్షత ఎదుర్కోలేదు: 'బెంగాల్ టైగర్' భీమ్స్‌

తెలుగు చలనచిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేకముద్ర వేసుకున్న సంగీత దర్శకుడు భీమ్స్‌. తెలంగాణ వాడయినా వివక్షత లేదని చెబుతున్నాడు. భీమ్స్‌ సెసిరోలియో అసలు పేరు. భీమ్స్‌ తన కెరీర్లో చేసిన మొదటి బిగ్‌ బడ్జెట్‌ మూవీ 'బెంగాల్‌ టైగర్‌'. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా ఈ నెల 10న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా భీమ్స్‌తో ఇంటర్వ్యూ..
 
తెలంగాణ వ్యక్తిగా విక్షతకు గురయ్యారా?
నేను చిన్నచిత్రాలు చేస్తున్నప్పుడే చాలామంది తెలంగాణవాడినని అనుకున్నారు. అలానే కొనసాగించాను. కానీ ఎక్కడా వివక్షతలేదు. నేను పుట్టింది ఖమ్మంలోనే. కానీ పూర్వీకులది రాజస్థాన్‌.
 
'బెంగాల్‌ టైగర్‌' ఆఫర్‌ ఎలా వచ్చింది?
దర్శకుడు సంపత్‌ నంది చాలాకాలం నుంచి మంచి ఫ్రెండ్‌. గతంలో కూడా తనకి సంబధించిన పలు సినిమాల్లో వర్క్‌ చేసాను. రవితేజతో ఈ ప్రాజెక్ట్‌ ఓకే అవ్వగానే సంపత్‌ నంది నాకు పలు సందర్భాలు ఇచ్చి కొన్ని ట్యూన్స్‌ రెడీ చేయమన్నాడు. మేమిద్దరం కలిసి ఆ ట్యూన్స్‌‌ని రవితేజ దగ్గరికి తీసుకెళ్ళాం. రవితేజ గారు ఆ ట్యూన్స్‌ విని అక్కడే నన్ను మెచ్చుకొని, ట్యూన్స్‌ ఓకే చెయ్యడమే కాకుండా ఈ సినిమాకి నువ్వే మ్యూజిక్‌ చెయ్యాలని చెప్పి నాకు అవకాశం ఇచ్చారు.
 
పెద్ద చిత్రంలో పనిచేయడం ఎలా అనిపించింది?
పెద్ద చిత్రంలో చేయడం వల్ల చాలా నేర్చుకున్నాను. చిన్న సినిమాలకు పెద్ద సినిమాలకు పాటల విషయంలో చాలా కేర్‌ వుంటుంది. అది దర్శకుడు, నిర్మాత, హీరోపైనే ఆధారపడి వుంటుంది. సాంగ్స్‌ కంపోజ్‌ చేసే టైంలో రవితేజ గారు చాలా సలహాలు ఇచ్చి నన్ను ఎంకరేజ్‌ చేసారు. అలాగే పాటలు ఓకే అన్నాక సింగర్స్‌ సెలక్షన్‌‌లో నాకు ఫ్రీడం ఇచ్చిన నిర్మాత రాధా మోహన్‌ మరియు డైరెక్టర్‌ సంపత్‌ నందిలకు స్పెషల్‌ థాంక్స్‌ చెప్పాలి. వాళ్ళందరి హెల్ప్‌ లేకపోతే ఈ బెంగాల్‌ టైగర్‌ ఆల్బమ్‌ ఇంత బాగా వచ్చేది కాదు.
 
ఇంకా హైప్‌ రాకపోవడానికి కారణం?
హైప్‌ అనేది సినిమాలను బట్టే వస్తుంది. ఇప్పుడు రవితేజ సినిమాతో అది నెరవేరుతుందని భావిస్తున్నాను. మన సెల్ఫ్‌ ప్రమోషన్స్‌ కంటే మనం చేసిన పనే మాట్లాడాలి అనుకునే మనస్తత్వం నాది.
 
ఈ పాటల్లో ప్రత్యేకత ఏమిటి?
బెంగాల్‌ టైగర్‌ సాంగ్స్‌‌కి అందరి నుంచీ మంచి రెస్పాన్స్‌ వస్తోంది, ఆ విషయంలో నేను చాలా హ్యాపీ. ఇక స్పెషల్‌ ఎలిమెంట్స్‌ అంటే, బాంచన్‌ సాంగ్‌‌లో తెలుగు రాప్‌ ట్రై చేసాం, తెలుగు సాంగ్స్‌‌లో అలా ట్రై చేయడం చాలా కొత్త అని చెప్పాలి. అలాగే రొమాంటిక్‌ సాంగ్‌ కూడా కొత్తగా ట్రై చేసాం, అది అందరికీ బాగా నచ్చింది. బెంగాల్‌ టైగర్‌ అనే సినిమా నా కెరీర్‌ ని మరో స్టేజ్‌ కి తీసుకెళ్తుందని భావిస్తున్నాను.
 
ఫోక్‌ఫ్లే అనే దాన్ని దాటి బయటకురాలేకపోతున్నారా? 
నేను రూరల్‌ ఏరియా నుంచి వచ్చాను, అందుకే నా మ్యూజిక్‌ లో అనుకోకుండానే ఆ ఫ్లేవర్‌ మిక్స్‌ అవుతూ ఉండచ్చు. ఇప్పుడిప్పుడే నేను ఆ ఫ్లేవర్‌ నుంచి కొద్ది కొద్దిగా బయటకి వస్తున్నాను. చెప్పాలంటే బెంగాల్‌ టైగర్‌ లో ఆ ఫ్లేవర్‌ లేకుండా చాలా కొత్త ట్యూన్స్‌ ట్రై చేసాను.
 
అసలు సంగీతానికి స్పూర్తి ఎవరు?
నేను మణిశర్మగారికి పెద్ద ఫ్యాన్‌, ఆయన ప్రభావం నా మీద కాస్త ఉంటుంది. అలాగే హారీష్‌ జైరాజ్‌ మ్యూజిక్‌ అన్నా చాలా ఇష్టం.
 
కొత్త ప్రాజెక్ట్‌లు?
ఈ చిత్రంతో పలు అవాకశాలు వస్తాయని అనుకుంటున్నా అని చెప్పారు.