శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By శ్రీ
Last Modified: గురువారం, 1 నవంబరు 2018 (22:24 IST)

సవ్యసాచి రెండు షెడ్యూళ్ల వరకూ వణుకు పుట్టింది... నాగ చైత‌న్య‌ ఇంటర్వ్యూ

యువ స‌మ్రాట్ అక్కినేని నాగ చైత‌న్య - ప్రేమ‌మ్ ఫేమ్ చందు మొండేటి కాంబినేష‌న్లో రూపొందిన తాజా చిత్రం స‌వ్య‌సాచి. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పైన రూపొందిన ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ పైన భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ నెల 2న ప్ర‌పంచ వ్యాప్తంగా స‌వ్య‌సాచి రిలీజైంది. ఈ సంద‌ర్భంగా నాగ చైత‌న్య ఇంట‌ర్వ్యూ మీకోసం..
 
సవ్యసాచి జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది..? 
ప్రేమమ్‌ సినిమాను నార్వేలో చిత్రీకరిస్తున్నప్పుడు డైరెక్టర్‌ చందు మొండేటి సవ్యసాచిలో మెయిన్‌ పాయింట్‌ను 5-10 నిమిషాలు వివరించారు. ఇలాంటి పాయింట్‌తో సినిమా చేస్తే ఎక్స్‌పెరిమెంట్‌ అవుతుందేమోనని అన్నాను. హైదరాబాద్‌ వచ్చిన తర్వాత పూర్తి కథను కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ అన్ని యాడ్‌ చేసి ఎక్స్‌ప్లెయిన్‌ చేశారు. చాలా బాగా అనిపించింది. అలా జర్నీ స్టార్ట్‌ అయ్యింది.
 
స్క్రిప్ట్‌లో మీ ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఎంతవరకు ఉంటుంది? 
స్క్రిప్ట్‌ రెడీ తయారవుతున్న దశలో ఇన్‌వాల్వ్‌ అవుతాను. ప్రతి స్క్రిప్ట్‌ వింటాను. ఏది మంచి, ఏది చెడు అని ఆలోచిస్తాను. కానీ ఒక లైన్‌ దాటి మనం వెళ్లకూడదని మాత్రం అనుకుంటా. దర్శకుడికి మనం ఇచ్చే రెస్పెక్ట్‌ అక్కడే తెలుస్తుంది.
 
సవ్యసాచి కథ వినగానే మీకెమనిపించింది? 
చందు నెరేషన్‌ చాలా చక్కగా ఇచ్చాడు. తన ఆలోచనా ధోరణిని నేను బాగా ఇష్టపడతాను. తన మీద నమ్మకంతోనే ఈ సినిమా చేశాను. ప్రేమమ్‌ రీమేక్‌ చేయవద్దని చాలా మంది చెప్పారు. కానీ పాయింట్‌ని చందు చక్కగా డీల్‌ చేశాడు. తెలుగు ఆడియెన్స్‌కు తగినట్లు బాగా బ్లెండ్‌ చేశాడు. నా దృష్టిలో తను న్యూ ఏజ్‌ ఫిల్మ్‌ మేకర్‌. ఈ సినిమా ఒకటీ, రెండు షెడ్యూళ్ల వరకు కాస్త ఎలా ఉంటుందోనని అనిపించింది. కానీ ఆ తర్వాత ఆలోచించాల్సిన అవసరం లేదనపించింది.
 
హలో బ్రదర్‌ స్టయిల్లో ఉంటుందా? 
లేదండీ. ఆ సినిమాలో నాన్నగారు ట్విన్స్‌లా నటించారు. కానీ ఇందులో అలా కాదు.. ట్విన్స్‌లో ఒకరు వానిష్‌ అయిపోతే ఆ లక్షణాలు మరొకరి వస్తాయి. అందుకనే ఉన్న వ్యక్తి ఎడమచేయి మరో వ్యక్తిలా ప్రవర్తిస్తుంది. అదే వానిషింగ్ సిండ్రోమ్. ఒకే శరీరంలో ఇద్దరు వ్యక్తులున్న ఫీలింగ్‌ కలుగుతుంది.
 
సినిమా మొత్తం యాక్షన్‌ జోనర్‌లోనే ఉంటుందా.? 
తొలి సగంలో చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌తో సరదాగా ఉంటుంది. ఉదాహరణకు నాకూ, నా ఎడమ చేతికి మధ్య చిన్న చిన్న గొడవలూ, రొమాన్స్‌.. ఇలాగన్నమాట. సెకండ్ హాఫ్‌లో మాత్రం నాకు, మాధవన్‌గారికి చాలా గట్టి కాంపిటిషన్‌ ఉంటుంది. ఓవరాల్‌గా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూ కొత్త పంథాలో సాగే సినిమా సవ్యసాచి.
 
మాయాబజార్‌లో మీ తాత గారు అర్జునుడిగా కనిపించారు. మీ ఫ్యామిలీలో మళ్ళీ మీరే సవ్యసాచిలో అర్జునుడిగా కనిపించారు. పౌరాణికాలు చేసే ఆలోచన ఉందా?
ఇందులో నేను అర్జునుడిగా ఒక చిన్న స్కిట్లో కనిపిస్తాను. ఆ పాత్రలు చేయాలంటే చాలా అనుభవం కావాలి. దానికింకా టైం ఉంది.
 
మాధవన్‌తో వర్కింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఎలా ఉంది.? 
మాధవన్ గారు ఇప్పటికీ ట్రెండ్‌ సెట్టెరే. ఆయనతో కలిసి పనిచేయడగం ఆనందంగా ఉంది. సెట్‌‌కీ నా ఫ్రెండ్స్‌ చాలా మంది వచ్చి, ఆయనతో ఫొటోలు తీసుకున్నారు. ఆయన్ని చూసి చాలా నేర్చుకున్నా.
 
శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఎలా ఉంటుంది.? 
ఇంకా టైటిల్‌ అనుకోలేదు. సినిమాలో కూడా నేను, సామ్‌ పెళ్లైన జంటగానే కనపడుతున్నాం. నిత్యం గొడవపడే జంటగా కనపడతాం. నిజ జీవితంలో ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు లాంటివిలేవు. సో.. సెట్లో నటిస్తున్నాం. కలిసి ఎక్కువ సమయాన్ని గడపడానికి వీలవుతోంది. ఎవరినీ ఎవరూ డామినేట్‌ చేయకుండా నటిస్తున్నాం. సమ్మర్‌కి విడుదలవుతుంది. ఫిబ్రవరికి షూటింగ్‌ అంతా పూర్తవుతుంది. మరోవైపు వెంకీమామ సినిమా డిసెంబర్‌ నుంచి మొదలవుతుంది అని చెప్పారు.
వీడియో చూడండి....