6 టీన్స్, గర్ల్ ఫ్రెండ్, సీమశాస్త్రి, సీమటపాకాయ్, దేనికైనా రెడీ, ఈడో రకం ఆడో రకం, ఇంట్లో దెయ్యం నాకేం భయం... ఇలా కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అనేలా సినిమాలు అందించిన దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి. యువ హీరో సందీప్ కిషన్ తో నాగేశ్వరరెడ్డి తెరకెక్కించిన చిత్రం తెనాలి రామకృష్ణ బి.ఎ, బి.ఎల్. `కేసులు ఇవ్వండి ప్లీజ్` ట్యాగ్ లైన్.
జవ్వాజి రామాంజనయులు సమర్పణలో ఎస్.ఎన్.ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీష్, ఇందుమూరి శ్రీనివాసులు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం నవంబర్ 15న గ్రాండ్‌గా విడుదలవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డితో ఇంటర్వ్యూ మీ కోసం...
తెనాలి రామకృష్ణ బి.ఎ, బి.ఎల్ గురించి చెప్పండి..?
పూర్తిగా ఎంటర్టైన్మెంట్ టార్గెట్ చేసిన సినిమా ఇది. ప్రేక్షకులను నవ్వించే సినిమాలు ఈమధ్య కాలంలో కాస్త తగ్గాయనే చెప్పాలి. మనుషులు ఒత్తిడి వలన నవ్వడం మరచిపోయారు. ఇంకా చెప్పాలంటే.. డబ్బులు ఎలా సంపాదించాలి..? పేరు ఎలా సంపాదించాలి..? వీటి గురించే ఆలోచిస్తున్నారు. ఈ ఒత్తిడి వలన అసలు నవ్వడం మానేసాం అనేది నా ఫీలింగ్. అప్పట్లో నరేష్ గారు ఎన్నో కామెడీ సినిమాల్లో నటించి ఎంతగానో నవ్వించారు. నవ్వడం మరచిపోవడం వలనే లాఫింగ్ క్లబ్‌లు వచ్చాయని నేను ఫీలవుతున్నాను. అయితే... నేను ఫన్ బాగా తీయగలను అని నా నమ్మకం. అందుకనే ఈ సినిమా ద్వారా పూర్తిగా నవ్వించి ఎంటర్టైన్ చేయాలనేదే నా ఉద్దేశ్యం. ఫ్యామిలీ అంతా చూసి హ్యాపీగా నవ్వుకునే సినిమా అవుతుంది.
ఈ సినిమాలో హైలెట్స్ ఏంటి..?
పాటలు ఈ సినిమాకి హైలెట్‌గా నిలుస్తాయని చెప్పొచ్చు. సాయి కార్తీక్ మూడు పాటలను అద్భుతంగా చేసాడు. భాస్కరభట్ల టైటిల్ సాంగ్ రాసారు. రామకృష్ణ తెనాలి అంటూ సాగే పాట చాలా బాగా నచ్చింది. అందరికీ ఈ పాటలు ఖచ్చితంగా నచ్చుతాయి.
ఈ మూవీకి తెనాలి రామకృష్ణ అని పేరు పెట్టడానికి కారణం..?
ఒక లాయర్ క్యారెక్టర్ తిమ్మినిబమ్మిని చేయడం అంటారు కదా.. అలా చేసేవాడే తెనాలి రామకృష్ణ. తెనాలి రామకృష్ణ ఎంత చమత్కారి.. ఎంత తెలివైనవాడో.. శ్రీకృష్ణదేవరాయులు ప్రమాదంలో పడినప్పుడు తెనాలి రామకృష్ణుడే కాపాడేవాడు. ఈ సినిమాలో కూడా అలాంటి ఒక ఎలిమెంట్ ఉంటుంది. తను ప్రేమించే.. గౌరవించే వ్యక్తి ప్రమాదంలో ఉన్నప్పుడు తెనాలి రామకృష్ణ ఏం చేసాడు..? నిజం తెలిసిన తర్వాత ఏం చేసాడు..? అనేదే ఈ సినిమా కథ.
అక్కినేని నాగేశ్వరరావు గారి తెనాలి రామకృష్ణ సినిమాకి దీనికి పోలికలు ఏమైనా ఉంటాయా..?
ఆ సినిమాలో ఉన్న చమత్కారం ఉంటుంది. హాస్యం ఉంటుంది. అలాగే అందులో ఉండే సీరియస్‌నెస్ కూడా ఉంటుంది. ఆ కథే ఈ కథ అని చెప్పను కానీ... ఆ క్యారెక్టర్లో ఉండే వేరియేషన్స్ ఈ తెనాలి రామకృష్ణలో ఉంటాయి.
బాలీవుడ్ మూవీ జాలీ ఎల్.ఎల్.బికి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా..?
జాలీ ఎల్ఎల్.బి చూసాను. దానికి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు.
హీరో సందీప్ కిషన్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
ఏ సమస్య వచ్చినా గొడవ పడకుండా పరిష్కరించుకోవాలి అంటాడు. అది ఎంత పెద్ద గొడవ అయినా సరే... కాంప్రమైజ్ అవ్వండి అని చెబుతుంటాడు. కాంప్రమైజ్ అయ్యుంటే కురుక్షేత్రం జరిగేది కాదు.. అలాగే రాముడు - రావణాసురుడు గొడవ ఎందుకు అనుకుని కాంప్రమైజ్ అయ్యుంటే రామాయణమే ఉండేది కాదు. యుద్దాలు జరగడానికి కారణం కాంప్రమైజ్ అవ్వని రెండు ఇగోలే కారణం. ఈ ఇగోలు లేకుండా ఉంటే బాగుండు అనేది హీరో క్యారెక్టర్. ఇలాంటి క్యారెక్టర్ కి అసలు కాంప్రమైజే అవ్వని ఓ కేసు వస్తుంది. అప్పుడే ఏం చేసాడు అనేది తెరపై చూడాలి.
చిత్రీకరణ సమయంలో సందీప్‌కి గాయం అయింది కదా?
అవును ఒక యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు బస్సు లో నుండి రౌడీలు అద్దాలు పగులగొట్టుకొని బయటకి రావాలి. ఆ సీన్ తీస్తున్నప్పుడు ఓ గాజు ముక్క సందీప్‌కి గుచ్చుకోవడం జరిగింది. దానితో రెండు నెలలు షూటింగ్ వాయిదాపడింది.
హన్సిక క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
తను సరదాగా ఉండే లాయర్. మహా మేథావి అనుకునే ఇన్నోసెంట్. ఒక్క కేసు కూడా వాదించదు కానీ.. గొప్ప లాయర్ అని ఫీలవుతుంటుంది.
వరలక్ష్మి క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
ఫస్ట్ టైమ్ తెలుగులో వరలక్ష్మి గారు సినిమా చేసారు. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. చాలా పెద్ద ఇమేజ్ ఉన్న ఆర్టిస్. ఎక్సట్రార్డినరీ పర్ఫార్మార్. ఆమెతో మంచి పాత్ర చేయించకపోతే సినిమాకే మైనస్ అవుతుంది. అందుకని చాలా ఆలోచించే ఆమెని తీసుకున్నాం. సినిమా చూసి ఆవిడ చాలా హ్యాపీగా ఫీలయ్యారు.
మీ నెక్ట్స్ మూవీ ఎవరితో...?
ఈ సినిమా సక్సస్ పైన ఆధారపడి ఉంటుంది. పూర్తి వివరాలు త్వరలో చెబుతాను.