శనివారం, 24 జనవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: సోమవారం, 2 నవంబరు 2015 (22:12 IST)

తాళి కడుతుంటే స్వాతి భయపడింది... 'త్రిపుర' నవీన్‌ చంద్ర ఇంటర్వ్యూ

ఎప్పుడూ గడ్డంతో వుండే కథానాయకుడు నవీన్‌చంద్ర. 'అందాల రాక్షసి' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ''దళం, భం బోలేనాధ్‌'' వంటి చిత్రాలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. నవీన్‌ చంద్ర నటిస్తున్న తాజా చిత్రం ''త్రిపుర''. స్వాతి టైటిల్‌ పాత్ర పోషిస్తున్న సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ''త్రిపుర'' చిత్రంలో తన పాత్ర గురించి, సినిమా విశేషాల గురించి మీడియాతో ముచ్చటించాడు. 
 
మీ ఎంపిక ఎలా జరిగింది?
''త్రిపుర'' నా క్యారెక్టర్‌‌కి చాలా డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయి. నా పాత్ర పేరు నవీన్‌ చంద్ర. ఒక సైక్రియార్టిస్ట్‌‌గా నటిస్తున్నాను. ఒక మానసిక వైద్యుడిగా, భర్త మాత్రమే కాకుండా నా పాత్రలో మరో వైవిధ్యమైన కోణం కూడా ఉంది. అదేమిటన్నది మీరు వెండితెరపై చూడాలి. నా కళ్లు నచ్చి నన్ను ఈ పాత్ర కోసం దర్శకుడు రాజ్‌ కిరణ్‌ ఎంపిక చేసుకొన్నారు. 
 
స్వాతి పాత్ర ఎలా వుంటుంది?
''త్రిపుర'' సినిమాలో స్వాతిది చాలా టిపికల్‌ రోల్‌. కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇస్తుంది. తప్పు చేస్తే భర్తను సైతం క్షమించని మనస్తత్వం కలది. అలాంటి ఒక అమ్మాయి జీవితంలో ఆమె కన్న కల ఎటువంటి మార్పులు తీసుకొచ్చింది అనేది ''త్రిపుర'' కథ. స్వాతి చాలా అద్భుతంగా నటించింది. 
 
సీనియర్‌ నటి కదా.. ఎలా అనిపించింది? 
''త్రిపుర'' సినిమాలో స్వాతి హీరోయిన్‌ అని తెలిశాక. ఆమె నటనలో నాకంటే సీనియర్‌ కదా.. ఆమెతో కలిసి ఎలా నటించాలా అని మొదట్లో టెన్షన్‌ పడ్డాను. అయితే.. ఆమె నాతో ఎంతో హుందాగా కలిసిపోయింది. భార్యాభర్తలుగా మా కెమిస్ట్రీ బాగా వర్కవుట్‌ అయ్యింది. ''త్రిపుర'' సినిమాలో పెళ్లి సీన్‌ ఉంది. మండపంలో కూర్చునేంతవరకూ బాగానే ఉన్నా.. సెట్‌లో హడావుడి మొదలయ్యేటప్పటికి, నిజంగానే పెళ్లి జరిగిపోతుందా? అనిపించింది. మా ఇంట్లో నా ఇద్దరి చెల్లెళ్ల పెళ్లిళ్లు చూసినప్పటికీ.. ఇదే నా మొదటి పెళ్లి సన్నివేశం కావడంతో చాలా టెన్షన్‌ పడ్డాను. ఇక తాళి కట్టమని చెప్పగానే నా కాళ్లూ, చేతులూ వణికిపోయాయి. నాతోపాటు స్వాతి కూడా భయపడింది. అయినా కూడా ఆ సీన్‌‌ని సింగిల్‌ టేక్‌లో ఫినిష్‌ చేసాం. 
 
ఏ తరహా సినిమా?
హారర్‌ సినిమా అనగానే రాత్రి 12 అవ్వగానే దెయ్యం రావడం, అందరూ భయపడటం జరుగుతుంటుంది. కానీ ''త్రిపుర'' సినిమాలో హారర్‌ ఎలిమెంట్స్‌ కొంచెం కొత్తగా ఉంటాయి. కథలో లీనమై ప్రేక్షకులు భయపడుతుంటారు. సో ''త్రిపుర'' ప్రేక్షకులకు తప్పకుండా ఒక మంచి అనుభూతిని కలిగిస్తుంది. 
 
ఎప్పుడూ గెడ్డం వుంటుందా?
సాధారణంగా డాక్టర్లంటే.. క్లీన్‌ షేవ్‌ చేసుకొని, కళ్ళజోడు పెట్టుకొని చాలా నీట్‌‌గా ఉంటారు. డైరెక్టర్‌ రాజ్‌ కిరణ్‌ గారు నాకు మొదట డాక్టర్‌ రోల్‌ అనగానే.. క్లీన్‌ షేవ్‌ చేసుకోవాలా అని అడిగాను. వెంటనే ఆయన ''గెడ్డం మాత్రం తీయకండి'' అన్నారు. అప్పుడు బెంగుళూరులో ఉన్న నా డాక్టర్‌ ఫ్రెండ్స్‌ దగ్గరకి వెళ్లి ఒక వారం రోజులు అబ్జర్వ్‌ చేసాను. ఆ హోమ్‌ వర్క్‌ నాకు నా క్యారెక్టర్‌ విషయం చాలా హెల్ప్‌ అయ్యింది. 
 
 హైలైట్స్‌?
''త్రిపుర'' సినిమాలో ప్రతి ఒక్కరి పాత్ర ఆకట్టుకొంటుంది. రావు రమేష్‌ గారు, షకలక శంకర్‌, సప్తగిరి, పూజ ఇలా అందరి పాత్రలూ సినిమాకి చాలా కీలకం. ప్రతి ఒక్కరి పాత్ర ప్రేక్షకులను అలరిస్తుంది. ముఖ్యంగా షకలక శంకర్‌, సప్తగిరిల కామెడీ సినిమాకి హైలిట్‌‌గా నిలుస్తుంది. 
 
'లచ్చిందేవి..' ఎంతవరకు వచ్చింది?
''త్రిపుర'' తర్వాత వచ్చే నెల ''లచ్చిందేవికి ఓ లెక్కుంది'' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ రెండు కాకుండా మరే చిత్రమూ అంగీకరించలేదు. కేవలం నా పాత్ర మాత్రమే కాకుండా కథ కూడా బాగుంటేనే సినిమా ఒప్పుకోవాలని ఫిక్స్‌ అయ్యాను.  
 
మీ పెండ్లి ఎప్పుడు? 
పెళ్లి ఫిక్సయ్యింది. అమ్మాయి ఎవరనేది త్వరలోనే చెబుతాను. ప్రస్తుతానికి కెరీర్‌ సాఫీగానే సాగుతున్నప్పటికీ.. ఒక నటుడిగా పూర్తిస్థాయిలో సెటిల్‌ అయ్యాక పెళ్లి చేసుకొందామనుకొంటున్నాను. అన్నీ కుదిరితే అతి త్వరలోనే నా నుంచి మీకు పెళ్లి పిలుపు అందుతుంది అని చెప్పారు.