మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By
Last Updated : శనివారం, 23 మార్చి 2019 (13:58 IST)

ఐపీఎల్-12 ఆరంభ పోరు.. జవాన్లకు కింగ్స్ ఎలెవన్ రూ.5 లక్షల చొప్పున విరాళం

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురు చూసే ఈ లీగ్ కోసం ఆయా ఫ్రాంచేజీలు సన్నద్ధమయ్యాయి.
 
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో డిఫెండింగ్‌ ఛాంపియ‌న్‌, మహేంద్రసింగ్‌ ధోనీ సారథ్యంలోని ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య తొలి పోరు రసవత్తంగా సాగనుంది. 
 
ఈ సందర్భంగా సారథులందరూ తమ కలర్‌ఫుల్‌ జెర్సీలను ధరించి ఐపీఎల్ వర్కింగ్ బాడీ సమావేశానికి హాజరైన ఫొటోలను ఐపీఎల్‌ అభిమానులతో పంచుకుంది. పుల్వామా ఉగ్రదాడికి సంతాపంగా అట్టహాసంగా నిర్వహించాల్సిన ఐపీఎల్‌ ఆరంభోత్సవ వేడుకలను బీసీసీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే. 
 
ఇకపోతే.. పుల్వామా ఆత్మాహుతి దాడిలో అమరులైన సైనికుల కుటుంబాలకు చేయూత అందించేందుకు ఐపీఎల్ ఫ్రాంఛైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యాజమాన్యం ముందుకొచ్చింది. ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఐదుగురు జవాన్లు ఉన్నారు. 
 
ఆయా కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున విరాళం ఇవ్వనున్నట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆ జట్టు కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్.. సీఆర్‌పీఎఫ్ డీఐజీ వీకే కౌండల్‌తో కలిసి బాధిత కుటుంబాలకు చెక్కులు అందించారు.