గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 నవంబరు 2020 (12:01 IST)

హిట్ మ్యాన్‌కు ఏమైంది..? ఆ లిస్టులో చేరిపోయాడే..!

ఐపీఎల్ 2020లో భాగంగా గురువారం ఢిల్లీతో జరిగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో ముంబై గెలుపును నమోదు చేసుకున్నప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ విఫలమైన విషయం తెలిసిందే. అతడు ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్‌ చేరాడు.

టోర్నీ చరిత్రలో ఇలా మొత్తం 13 సార్లు డకౌటై ఓ అనవసరపు రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు హర్భజన్ సింగ్‌, పార్థివ్‌ పటేల్‌ ఇలాగే 13సార్లు డకౌటయ్యారు. హిట్‌మ్యాన్‌ ఇప్పుడు వారి సరసన చేరిపోయాడు. 
 
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయికి ఆదిలోనే దిల్లీ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ షాకిచ్చాడు. డేనియల్‌ సామ్స్‌ వేసిన తొలి ఓవర్‌లో డికాక్‌ మూడు బౌండరీలు బాది 15 పరుగులు సాధించగా శ్రేయస్‌ అయ్యర్‌ రెండో ఓవర్‌ను అశ్విన్‌కు అప్పగించాడు. మళ్లీ రెండు బంతులాడిన డికాక్‌ సింగిల్‌ తీయడంతో రోహిత్‌ మూడో బంతిని ఎదుర్కొన్నాడు. అయితే, అది అనూహ్యంగా ఎల్బీగా నమోదయ్యింది. 
 
అలా హిట్‌మ్యాన్‌ గోల్డెన్‌ డకౌట్‌గా వెనుతిరగడంతో ఈ లీగ్‌లో 13వ సార్లు పరుగుల ఖాతా తెరవకుండా పెవిలియన్‌ చేరాడు. మరోవైపు ప్లేఆఫ్స్‌లోనూ ఇలా డకౌటవ్వడం రోహిత్‌కిది మూడోసారి. ఇప్పటివరకు ప్లేఆఫ్స్‌లో మొత్తం 19 ఇన్నింగ్స్‌ ఆడిన ముంబయి సారథి 12.72 సగటుతో 229 పరుగులే చేశాడు.
 
ఇక ఈ సీజన్‌లో గాయం కారణంగా రోహిత్‌ నాలుగు మ్యాచ్‌లు ఆడలేకపోయిన సంగతి తెలిసిందే. కీరన్‌ పొలార్డ్‌ జట్టును ముందుండి నడిపించాడు. కానీ, లీగ్‌ దశలో హైదరాబాద్‌తో తలపడిన చివరి మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ బరిలోకి దిగి విఫలమయ్యాడు. కేవలం 4 పరుగులే చేశాడు. ఇప్పుడు మరోసారి విఫలమవడంతో అతడి ఫామ్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీపై విజయం సాధించిన ముంబై ఫైనల్‌ చేరగా అక్కడైనా రోహిత్‌ చెలరేగాలని అభిమానులు ఆశిస్తున్నారు.