శుక్రవారం, 22 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 నవంబరు 2020 (17:13 IST)

ప్లే ఆఫ్‌కు చేరాలంటే గెలిచి తీరాల్సిందే.. హైదరాబాద్ ఆఖరి పోరాటం!

యూఏఈ వేదికగా జరగుతున్న ఐపీఎల్ 13వ సీజన్ పోటీల్లో భాగంగా మంగళవారం ఆఖరి పోరాటం జరుగనుంది. ఇందులో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. అయితే, హైదరాబాద్ జట్టుకు ఈ మ్యాచ్ ఆఖరిపోరాటం వంటిది. ఎందుకంటే, ఎస్ఆర్‌హెచ్ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలిచి తీరాల్సివుంది. అందుకే అమీతుమి తేల్చుకునేందుకు డేవిడ్ వార్నర్ సారథ్యంలోని హైదరాబాద్ జట్టు సిద్ధమైంది. 
 
ముంబై ఇండియన్స్‌పై హైదరాబాద్ జట్టు గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ కథ ముగిసినట్టే. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు గెలిచి మంచి నెట్‌ రన్‌రేట్‌తో ఉన్న సన్‌రైజర్స్‌.. ఇప్పటికే నాకౌట్‌కు అర్హత సాధించిన ముంబైను ఓడిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ఓడితే మాత్రం కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మార్గం సుగమమవుతుంది. 
 
మరోవైపు, లీగ్‌ దశను గెలుపుతో ముగించాలని ముంబై భావిస్తోంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అద్భుత విజయాలు సాధించిన హైదరాబాద్‌ జోరుమీద ఉంది. వికెట్ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ బెయిర్‌స్టో స్థానంలో ఓపెనర్‌గా జట్టులోకి వచ్చిన వృద్ధిమాన్‌ సాహు గొప్పగా రాణిస్తున్నాడు.   బెయిర్‌స్టో స్థానంలో చోటు దక్కించుకున్న ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ బంతితో అదరగొడుతున్నాడు. 
 
అలాగే, స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌తో పాటు పేసర్లు సందీప్‌ శర్మ, నటరాజన్‌ రాణిస్తుండడం హైదరాబాద్‌కు సానుకూలాంశం. 2016లోనూ హైదరాబాద్‌ తప్పక గెలువాల్సిన చివరి మూడు మ్యాచ్‌ల్లో సత్తాచాటి ప్లేఆఫ్స్‌కు చేరిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ఇరు జట్లూ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 15 సార్లు తలపడగా, ముంబై ఇండియన్స్ మొత్తం 8 సార్లు విజయకేతనం ఎగురవేసింది. గత మ్యాచ్‌లో 
 
ఇదిలావుంటే, ప్లే ఆఫ్స్‌కు ఇటు ఢిల్లీ క్యాపిటల్స్, అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు అడుగుపెట్టింది. లీగ్‌ ఆరంభ దశలో ఆకట్టుకున్న కోహ్లీ సేన వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడినా.. రన్‌రేట్‌ మెరుగ్గా ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చింది. 
 
సన్ రైజర్స్ జట్టు అంచనా... 
డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహు, మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, జేసన్ హోల్డర్, అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్, నదీం, సందీప్ శర్మ, టి. నటరాజన్. 
 
ముంబై ఇండియన్స్ జట్టు అంచనా... 
ఇషాన్ కిషన్, డి కాక్, సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, పొల్లార్డ్, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, రాహుల్ చాహర్, నాథన్ కౌల్టర్ నైల్, జయంత్ యాదవ్, మిచెల్ మెక్‌క్లీనగన్.