శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 అక్టోబరు 2020 (09:53 IST)

చెలరేగుతున్న సీఎస్కే బ్యాట్స్‌మెన్లు.. ఇతర జట్ల ఆశలపై నీళ్లు

ఐపీఎల్ 13వ సీజన్‌ పోటీల్లో భాగంగా గురువారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయభేరీ మోగించింది. ప్లే ఆఫ్స్‌కు దూరమై నామమాత్రపు మ్యాచ్‌లో చెన్నై ఆటగాళ్లు చెలరేగి ఆడుతున్నారు. ఫలితంగా ఇతర జట్ల ప్లే ఆఫ్ ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. మొన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఓడించిన చెన్నై.. గత రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.
 
ఒక విధంగా చెప్పాలంటే ఈ విజయం చెన్నైకి ఊరటే. కానీ కోల్‌కతాకు మాత్రం భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. కోల్‌కతాకు మరొక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉండగా, పంజాబ్‌కు రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ఆ రెండింటిలోనూ విజయం సాధిస్తే ఆ జట్టు నేరుగా ప్లే ఆఫ్స్‌కు వెళ్తుంది. అప్పుడు తర్వాతి మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించినప్పటికీ ఫలితం ఉండదు.
 
కాగా, చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నితీశ్ రాణా మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై చివరి బంతికి విజయాన్ని అందుకుంది. 
 
వాట్సాన్ 14 పరుగులకే అవుటైనప్పటికీ రుతురాజ్ గైక్వాడ్ మరోమారు చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. 53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 
 
ఇక రాయుడు 38, శామ్ కరణ్ 13 (నాటౌట్) పరుగులు చేశారు. చివరి రెండు బంతులకు చెన్నై విజయానికి ఏడు పరుగులు అవసరమైన వేళ రవీంద్ర జడేజా వరుస సిక్సర్లు బాది విజయాన్ని అందించాడు. 11 బంతులు మాత్రమే ఎదుర్కొన్న జడేజా 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 31 పరుగులు చేశాడు. 72 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించిన గైక్వాడ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
 
అంతకుముందు కోల్‌కతా ధాటిగా ఆడింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ 26, నరైన్ 7, ఆర్‌కే సింగ్ 11, మోర్గాన్ 15, కార్తీక్ 21(నాటౌట్), రాహుల్ త్రిపాఠి 3 (నాటౌట్) పరుగులు చేశారు. 
 
సహచరులందరూ క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరుగుతున్నా క్రీజులో పాతుకుపోయిన నితీశ్ రాణా చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడడంతో కోల్‌కతా భారీ స్కోరు చేయగలిగింది. 61 బంతులు ఆడిన రాణా 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 87 పరుగులు చేశాడు.