బుధవారం, 11 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2021
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 ఏప్రియల్ 2021 (19:48 IST)

కోవిడ్ కల్లోలం, ఆటగాళ్లు వెళ్లిపోయినా ఐపీఎల్ జరిగి తీరుతుందట

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ 14వ సీజన్ పోటీలు దేశంలో ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే, ఈ పోటీల్లో పాల్గొంటున్న విదేశీ ఆటగాళ్లు చాలా ఆందోళన చెందుతున్నారు. దేశంలో కరోనా రెండో దశ వ్యాప్తి చేయిదాటిపోయింది. దీంతో కుప్పలుతెప్పలుగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అలాగే, మృతుల సంఖ్య కూడా విపరీతంగా ఉంది. 
 
ఒకవైపు, కరోనా కేసులు అమాంతం పెరుగుతున్న తరుణంలో ఐపీఎల్ లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు భారత ఆటగాళ్లు కూడా తమ కుటుంబీకులు కరోనా బారిన పడుతుండటంతో ఒత్తిడికి గురవుతున్నారు. రవిచంద్రన్ అశ్విన్ కూడా ఐపీఎల్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు.
 
ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఆటగాళ్లు ఎవరైనా ఐపీఎల్ టోర్నీ నుంచి వెళ్లిపోవాలనుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్ల అభిప్రాయాలకు గౌరవమిస్తామని తెలిపింది.
 
ఇప్పటివరకు ఈ సీజన్ ఐపీఎల్ ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగిందని బీసీసీఐ బోర్డు సభ్యుడు ఒకరు తెలిపారు. ఎవరైనా వెళ్లిపోవాలనుకుంటే... అది వారు తీసుకున్న మంచి నిర్ణయంగానే భావిస్తామని చెప్పారు. ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌లు యాధావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు.