ఆ దేవత గుడి ముందు బండరాళ్లను ఎత్తితే పెళ్ళవుతుంది.. ఎక్కడ? (video)

A man lifting rock
జె| Last Updated: గురువారం, 27 జూన్ 2019 (15:36 IST)
సాధారణంగా పెళ్ళి కాకుంటే నియమంగా ఉండి ఆలయాలకు వెళ్ళి పూజలు చేయమని పెద్దవారు చెబుతుంటారు. స్వామి, అమ్మవార్లు అనుగ్రహిస్తే పెళ్ళి అయిపోవడం ఖాయమని భావిస్తుంటారు. ఇలా కొంతమందికి జరుగుతుంటుంది.

కానీ చిత్తూరు జిల్లాలో ఒక ఆలయానికి వెళ్ళి అమ్మవారిని సేవించి ఆలయం ముందు ఉన్న బండరాయిని ఎత్తి కిందపడేస్తే చాలు సంవత్సరంలోనే పెళ్ళి అయిపోతుంది. ఇది వినడానికి వింతగా అనిపించినా జరుగుతున్న సత్యం. ఒక గ్రామానికి దేవతగానే కాదు వేలాది మంది భక్తుల కొంగుబంగారంగా మారిన ఆలయం అది. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుంది.

చిత్తూరు జిల్లా. ఆధ్మాత్మిక క్షేత్రాలకు పెట్టింది పేరు. ప్రతి గ్రామంలోను కనీసం మూడు నుంచి నాలుగు ఆలయాలు ఉంటాయి. ఎన్నో ఆలయాలకు పెట్టింది పేరు. పురాతనమైన ఆలయాలన్నీ చిత్తూరు జిల్లాలోనే ఎక్కువగా ఉన్నాయని పురాతన శాఖ అధికారులు ఇప్పటికే నిర్థారించారు. అలాంటి పురాతనమైన ఆలయాల్లో ఒకటి చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం మోటుమల్లెల పంచాయతీ పెండ్లి కనుమ.

ఈ గ్రామంలో 300 యేళ్ళ నాటి చరిత్ర కలిగిన గంగమ్మ ఆలయం ఉంది. పురాతన కాలంలో స్వయంభుగా వెలసిన ఆలయమిది. అమ్మవారి విగ్రహంతో పాటు రెండు బండరాళ్ళు ఈ ఆలయంలో కనిపించాయి. ఒకటి పోతురాయి, మరొకటి పెట్ట రాయి. ఈ రెండురాళ్ళు 80 నుంచి 110 కిలోల ఉంటాయి. ఆలయానికి వచ్చే భక్తులు అమ్మవారిని సేవించిన తరువాత బండరాయిని ఎత్తి కింద పడేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయన్నది భక్తుల నమ్మకం. గత 300 సంవత్సరాల నుంచి గ్రామంలో ఇదే ఒక ఆచారంగా నడుస్తోంది. గ్రామస్తులందరూ ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.

మోటు మల్లెల గ్రామంలో కొండప్పనాయుడు అనే వ్యక్తి నిద్రిస్తుండగా పెండ్లి గంగమ్మ కలలోకి వచ్చి దర్సనమిచ్చింది. మీ గ్రామంలో ఒకచోట నేను వెలిశాను. నేను వెలిసిన చోట ఆలయాన్ని నిర్మించమని అమ్మవారు కలలో చెప్పారు. దీంతో కొండప్పనాయుడు గ్రామం మధ్యలో వచ్చి చూస్తే అమ్మవారి విగ్రహంతో పాటు రెండు బండరాళ్ళు కనిపించాయి. వెంటనే ఆ ప్రాంతంలో అమ్మవారి ఆలయాన్ని నిర్మించేశారు. అప్పటి నుంచి నరసింహుల నాయుడు, రామలక్ష్మనాయుడు, జయచంద్రనాయుడు ఇలా దాతలు ఆలయాన్ని నడుపుతూ వస్తున్నారు.
marriage

పెండ్లి గంగమ్మను మనసారా సేవించి బండరాయిని పైకెత్తితే ఎలాంటి సమస్యలున్నా తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం. పెళ్ళయి పిల్లలు పుట్టనివారికి సంతానం కలగడం, కుటుంబ సభ్యులు తొలగిపోవడం, ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే బయటపడటం... ఇలా ఒక్కటేమిటి అన్ని సమస్యలను అమ్మవారికి విన్నవించి బండరాయిని ఎత్తితే చాలు మీ సమస్య తొలగిపోయినట్లేనంటున్నారు గ్రామస్తులు.

80 నుంచి 110 కిలోలున్న గుండ్లను పైకి పూర్తిగా ఎత్తాల్సిన అవసరం లేదు. భక్తి మనస్సులో ఉంటే చాలు. అమ్మవారిని సేవించి బండరాళ్ళకు దణ్ణం పెట్టుకుని ఎత్తేందుకు ప్రయత్నం చేసినా చాలు అమ్మవారు ఆశీర్వదిస్తారన్నది భక్తుల నమ్మకం. గంగమ్మ ఆలయంలో జాతర కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ నెల 30వ తేదీన జాతర జరుగుతోంది. అమ్మవారి జాతరకు ఒక్క చిత్తూరు జిల్లా నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు చేరుకుని పూజలు నిర్వహిస్తుంటారు.దీనిపై మరింత చదవండి :