బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 జులై 2021 (15:08 IST)

టెలికాం చార్జీల బాదుడు.. భారీగా పెంచిన కంపెనీలు

కరోనా కష్టకాలంలో వినియోగదారులపై టెలికాం కంపెనీలు మరింత భారాన్ని మోపేందుకు సిద్ధమయ్యాయి. ఆదాయం పెంచుకునే చర్యల్లో భాగంగా, టెల్కోలు అదనపు వడ్డనలకు సిద్ధమవుతున్నాయి. పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్ల అప్‌గ్రేడ్‌ పేరుతో ఎయిర్‌టెల్‌ ఇప్పటికే రేట్లు పెంచేసింది. రిటైల్‌ కస్టమర్ల పోస్ట్‌పెయిడ్‌ పథకాల కనీస నెల చార్జీ ఇదివరకు రూ.299 కాగా, రూ.399కి పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది.
 
ఇకపోతే, కార్పొరేట్‌ కస్టమర్ల పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్ల కనీస చార్జీని రూ.199 నుంచి రూ.299కి పెంచింది. అంతేకాదు, కొత్త కస్టమర్లకు రూ.749 ఫ్యామిలీ ప్లాన్‌ను ఉపసంహరించుకుంది. 
 
ఇకపై కొత్త కస్టమర్లకు కేవలం రూ.999 ఫ్యామిలీ ప్లాన్‌ మాత్రమే అందుబాటులో ఉంటుందని ఎయిర్‌టెల్‌ స్పష్టం చేసింది. అయితే, అప్‌గ్రేడెడ్‌ ప్లాన్లపై సంస్థ అదనపు డేటా ఆఫర్‌ చేస్తోంది. కంపెనీ మొత్తం ఆదాయంలో 25 శాతం వరకు పోస్ట్‌పెయిడ్‌ విభాగం నుంచే సమకూరుతోంది. 
 
ఇంకోవైపు, వొడాఫోన్‌ ఐడియా సైతం టారిఫ్‌‌లను పెంచే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఈ కంపెనీ ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకునివున్న విషయం తెల్సిందే. ఏజీఆర్‌ బకాయిల విషయంలోనూ ఊరట లభించకపోవడంతో వ్యాపారాన్ని కొనసాగించేందుకు భారీగా నిధుల సేకరణ కంపెనీకి అనివార్యంగా మారింది. 
 
ఈ నేపథ్యంలో ఆదాయం పెంచుకోవడమూ కంపెనీకి కీలకమే. దీంతో ఎయిర్‌టెల్‌ చూపిన మార్గాన్ని అనుసరిస్తూ, వొడాఫోన్‌ ఐడియా సైతం పోస్ట్‌ పెయిడ్‌ పథకాల చార్జీలను పెంచే అవకాశం ఉంది.