మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 సెప్టెంబరు 2020 (16:10 IST)

జియో 4జీ తరహాలో ఎయిర్‌టెల్ కూడా చౌక ధరకు స్మార్ట్ ఫోన్లు

రిలయన్స్ జియో 4జీ స్మార్ట్‌ఫోన్‌ ద్వారా టెలికాం రంగంలో ఓ విప్లవాన్ని సృష్టించింది. తాజాగా ఎయిర్‌టెల్ సంస్థ కూడా తమ వినియోగదారుల కోసం తక్కువ ధరలకు 4జీ ఆండ్రాయిట్ స్మార్ట్‌ఫోన్లను త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. 
 
తద్వారా తమ వినియోగదారుల సంఖ్యను, సేవలను మరింత విస్తరించేందుకు అవకాశాలు లభిస్తాయని ఎయిర్‌టెల్ భావిస్తోంది. తక్కువ ధరకు 4జీ స్మార్ట్‌ఫోన్లను తీసుకురావడంపై పలు స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలతో ఎయిర్‌టెల్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 
 
ఎయిర్‌టెల్ బ్రాండ్‌తోనే ఈ స్మార్ట్‌ఫోన్లను తయారు చేసి ఇచ్చేలా సదరు తయారీ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇతర బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లలో ఎయిర్‌టెల్ 4జీ సేవలను మాత్రమే వినియోగించేలా చౌక ధరకు స్మార్ట్‌ఫోన్లను తయారు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
 
దేశంలో డేటా ఛార్జీలు సామాన్యులకు సైతం అందుబాటులో ఉన్నా... స్మార్ట్‌ఫోన్ల ఖరీదు ఎక్కువగా ఉండటంతో సామాన్య ప్రజలు వీటికి దూరంగా ఉంటున్నారు. వీరిని దృష్టిలో ఉంచుకునే తక్కువ ధరలతో స్మార్ట్‌ఫోన్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
 
తక్కువ ధరలకు స్మార్ట్‌ఫోన్లు అందించి సామాన్యులకు కూడా దగ్గరకావడం ద్వారా తమ వినియోగదారుల పరిధిని మరింత పెంచుకునేందుకు సొంత స్మార్ట్‌ఫోన్లు ఉపయోగపడుతుందని ఆ సంస్థ భావిస్తోంది.