మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 మే 2021 (12:54 IST)

మొబైల్‌ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. సిమ్ మార్చాలంటే..?

మొబైల్‌ ఫోన్‌ యూజర్లకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. పోస్ట్‌ పెయిడ్‌ నుంచి ప్రీ పెయిడ్‌కు లేదా ప్రీ పెయిడ్‌ నుంచి పోస్ట్‌ పెయిడ్‌కు మారాలంటే ఇకపై సిమ్‌ మార్చాల్సిన అవసరం లేదు. కేవలం ఓ ఓటీపీ(వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌) ద్వారా మార్చుకోవచ్చు. 
 
ఈ ప్రక్రియ జరిగేలా టెలికం శాఖకు (డాట్‌) టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ ప్రతిపాదించింది. దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి, ఆధారాలు (పీవోసీ) ఇవ్వాలంటూ టెలికం ఆపరేటర్లకు డాట్‌ సూచించింది. పీవోసీని బట్టి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు డాట్‌ ఏడీజీ ఓ నోట్‌లో తెలిపారు.
 
టెల్కోల ప్రతిపాదన ప్రకారం.. కనెక్షన్‌ను మార్చుకోదల్చుకున్న వారు తమ సర్వీస్‌ ప్రొవైడర్‌కు ఎస్‌ఎంఎస్, ఐవీఆర్‌ఎస్, వెబ్‌సైట్, అధీకృత యాప్‌ ద్వారా అభ్యర్ధన పంపాల్సి ఉంటుంది. దీన్ని ఆమోదిస్తూ .. టెలికం సంస్థ ఒక ప్రత్యేక ఐడీ, ఓటీపీని మొబైల్‌ యూజర్‌కి పంపిస్తుంది. 
 
ఈ ఓటీపీ 10 నిమిషాల దాకా చెల్లుబాటు అవుతుంది. ఓటీపీని ధృవీకరిస్తే.. కనెక్షన్‌ మార్పునకు యూజరు సమ్మతించినట్లుగా టెలికం సంస్థ పరిగణిస్తుంది. 
 
ఏ తేదీ, సమయం నుంచి మార్పు అమల్లోకి వస్తుందనేది సమాచారం అందజేస్తుంది. ఇలా కనెక్షన్‌ మారే క్రమంలో సేవల అంతరాయం గరిష్టంగా 30 నిమిషాల కంటే ఎక్కువ అంతరాయం ఉండరాదంది.