ఆగిన ఇన్‌స్టా సేవలు - ట్విట్టర్‌లో యూజర్లు గోలగోల..
ప్రముఖ సోషల్ మీడియా ప్రసార మాధ్యమాల్లో ఒకటైన ఇన్‌స్టా సేవలకు మళ్లీ అంతరాయం ఏర్పడింది. వారం రోజుల వ్యవధిలో ఇలా జరగటం ఇది రెండోసారి కావడం గమనార్హం. దీంతో వినియోగదారులు నానా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా, ట్విట్టర్ వేదికగా యూజర్లు గోలగోల చేస్తున్నారు.
శుక్రవారం అర్థరాత్రి 12 గంటల తర్వాత దాదాపు గంటపాటు ఇన్‌స్టా పనిచేయలేదు. ఈ సమయంలో వినియోగదారులు Insta ద్వారా సందేశాలను పంపగలిగారు కానీ వారి ఫీడ్ మాత్రం అప్‌డేట్ కాలేదు. ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అయిన తర్వాత #instagramdownagain అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ చేసింది.
ట్విట్టర్ వినియోగదారులు మీమ్‌లను పోస్ట్ చేయడం కనిపించింది. అయితే కొంత సమయం తర్వాత ఇన్‌స్టాగ్రామ్ మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది. దీంతో యూజర్లు ఊపిరి పీల్చుకున్నారు. అదేసమయంలో ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అయినందుకు కంపెనీ కూడా విచారం వ్యక్తం చేసింది. మమ్మల్ని క్షమించండి సమస్య పరిష్కరించడానికి వీలైనంత త్వరగా పని చేస్తున్నామని ఇన్‌స్టాగ్రామ్ ప్రకటన విడుదల చేసింది.
కాగా, గత సోమవారం ఫేస్‌బుక్ యాజమాన్యంలోని ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు 7 గంటల పాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తర్వాత రాత్రి ఇన్‌స్టాగ్రామ్ మళ్లీ గంటసేపు పనిచేయలేదు వారంలో ఇది రెండోసారి. ఇలా ఎందుకు జరగుతుందో ఎవ్వరికి అర్థం కావడం లేదు. గతంలో కూడా చాలాసార్లు ఇలాంటి సమస్య ఎదురైంది కానీ ఎప్పుడు ఇంత సమయం పట్టలేదు. 5 నుంచి 10 నిమిషాలలో సమస్య పరిష్కారం అయ్యేది.