కరోనా కల్లోలం : వర్క్ ఫ్రమ్ హోంను పొడగించిన గూగుల్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి వేగం ఏమాత్రం తగ్గడం లేదు. పైగా, పలు దేశాల్లో ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ వైరస్ బారినపడిన అనేక దేశాలు ఇప్పటికీ కోలుకోలేదు. ఇలాంటి దేశాల్లో భారత్ కూడా ఉంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే వెసులుబాటును కల్పించాయి. అలాంటి వాటిలో టెక్ దిగ్గజం గూగుల్ కూడా ఒకటి.
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో గూగుల్ సంస్థ వర్క్ ఫ్రమ్ హోమ్‌ను పొడిగించింది. తమ ఉద్యోగుల కోసం ఇంటి నుంచి పనిచేసే సౌలభ్యాన్ని వచ్చే యేడాది జూన్ 30వ తేదీ వరకు పొడగిస్తున్నట్లు గూగుల్ సంస్థ వెల్లడించింది. గూగుల్‌కు చెందిన ఆల్ఫాబెట్ సంస్థ.. ఆఫీసులో పని అవసరం లేని వారికి వర్క్ ఫ్రమ్ హోమ్‌ను పొడిగిస్తున్నట్లు చెప్పింది.
వాస్తవానికి ఈ ఏడాది జూన్‌లో ఆఫీసులు తెరువాలనుకుంటున్నట్లు మొదట్లో గూగుల్ ప్రకటించింది. కానీ ఆ తర్వాత మళ్లీ వర్క్ హోమ్ కాన్సెప్ట్‌ను ఎంకరేజ్ చేసింది. ఈ ఏడాది చివర వరకు తమ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్‌ను వచ్చే ఏడాది జూన్ చివర వరకు పొడగించి, ఉద్యోగులకు వెసులుబాటును కల్పించింది.