గురువారం, 21 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 మార్చి 2024 (19:00 IST)

భారతీయ యాప్ డెవలపర్లకు టెక్ దిగ్గజం గూగుల్ వార్నింగ్

google
ప్రముఖ సెర్చింజన్ గూగుల్ భారత్‌లోని పది యాప్ డెవలపర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. కొన్ని కంపెనీల సర్వీసు చార్జీలు చెల్లించకుండా తమ బిల్లింగ్ నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తున్నాయని, ఇలాంటి వాటిపై విధానపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు తమ ప్లే స్టోర్ నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. ఇటీవల వాల్‌మార్ట్‌కు చెందిన డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్‌పే సంస్థ ఇండస్ యాప్ స్టోర్‌ను ఇటీవల ప్రారంభించింది. దీంతో గూగుల్ - ఫోన్‌పేల మధ్య వివాదం రాజుకుని తారా స్థాయికి చేరుకుంది. దీంతో కొన్ని కంపెనీల సర్వీసు చార్జీలు చెల్లించకుండా బిల్లింగ్ నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తున్నాయి. దీంతో ఆ యాప్ డెవలపర్లపై గూగుల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
'భారత్‌లో 2 లక్షలకు పైగా డెవలపర్లు మా గూగుల్‌ ప్లేను వినియోగిస్తున్నారు. వీరంతా మా పాలసీలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. 10 కంపెనీలు మాత్రం కొంతకాలంగా గూగుల్ ప్లేలో మేం అందిస్తున్న సర్వీసులకు ఛార్జీలు చెల్లించడం లేదు. ఇందులో ప్రముఖ స్టార్టప్‌లు కూడా ఉన్నాయి. కోర్టు నుంచి మధ్యంతర రక్షణ పొందుతూ ఈ కంపెనీలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి' అని గూగుల్ ఆరోపించింది.
 
'స్థానిక చట్టాలను మేం గౌరవిస్తాం. గూగుల్‌ ప్లేలో మేం అందించే సేవలకు ఛార్జీలు వసూలు చేయడం మా హక్కు. దాన్ని ఇన్నేళ్లలో ఏ కోర్టూ, రెగ్యులేటర్‌ తిరస్కరించలేదు. ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఇందులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఈ 10 కంపెనీలు మాత్రం సర్వీసు ఛార్జీలను చెల్లించడం లేదు. మిగతా ప్లే స్టోర్లకు మాత్రం యథావిధిగా ఛార్జీలు కడుతున్నాయి. మా పాలసీ నిబంధనలను ఉల్లంఘించే కంపెనీలపై చర్యలు తీసుకుంటాం. అవసరమైతే వాటి యాప్‌లను స్టోర్‌ నుంచి తొలగిస్తాం' అని గూగుల్‌ హెచ్చరించింది.