శనివారం, 14 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (18:31 IST)

రిలయన్స్ జియో సేవలకు ఏడు వసంతాలు.. కొత్త ప్రీపెయిడ్ ఆఫర్లు

jioservice
పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ జియో సేవలు దేశంలో ప్రారంభమై ఏడేళ్లు పూర్తి చేసుకున్నాయి. ఈ సందర్భంగా జియో మూడు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను పరిచయం చేసింది. ఈ వివరాలను కంపెనీ తన అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంచింది. 
 
జియో వెబ్ సైట్ ప్రకారం.. రూ.299 ప్లాన్‌లో రోజువారీ 2జీబీ ఉచిత డేటాను పొందొచ్చు. ఉచిత వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్ లు కూడా పొందొచ్చు. దీనికి అదనంగా 7జీబీ డేటాను ఉచితంగా ఇవ్వనుంది. ఈ ప్లాన్ కాల వ్యవధి 28 రోజులు.
 
అలాగే, రూ.749 ప్లాన్‌లో రోజువారీ 2జీబీ ఉచిత డేటా, ఉచిత వాయిస్ కాల్స్, రోజువారీ 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. వీటితోపాటు 14జీబీ డేటా అదనంగా లభిస్తోంది. దీని గడువు 90 రోజులు. రూ.2,999 ప్లాన్ ఏడాది వ్యాలిడిటీతో వస్తోంది. 
 
ఇందులో రోజువారీ 2.5 జీబీ ఉచిత డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు, ఉచిత వాయిస్ కాల్స్ లభిస్తాయి. వీటికి అదనంగా 21జీబీ ఉచిత డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు. దీనికి మెక్ డొనాల్డ్ మీల్‌పై ఆఫర్ ఉంది. రిలయన్స్ డిజిటల్ కొనుగోళ్లపై 10 శాతం రాయితీని కూడా పొందొచ్చని పేర్కొంది.