బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 జూన్ 2021 (08:26 IST)

రిలయన్స్ జియో నుంచి చౌక ధరకే స్మార్ట్ ఫోన్

దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన రిలయన్స్ జియో మరో సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టనుంది. దేశంలోనే అతి తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్‍ను ఆవిష్కరించనుంది. దీనికి జియో ఫోన్ నెక్ట్స్ అనే పేరు పెట్టారు. 
 
ఇంతకుముందు జియో ఫోన్ పేరిట ఫీచర్ ఫోన్ తీసుకువచ్చిన రిలయన్స్ ఇప్పుడు పూర్తిస్థాయి స్మార్ట్ ఫోన్‌తో రంగంలోకి దిగుతోంది. ఈ ఏడాది సెప్టెంబరులో వినాయకచవితి సందర్భంగా దీన్ని మార్కెట్లోకి విడుదల చేసేలా ప్రణాళికలు రూపొందించింది. 
 
సెప్టెంబరు 10 నుంచి జియో ఫోన్ నెక్ట్స్ అందుబాటులోకి వస్తుందని రిలయన్స్ వర్గాలు వెల్లడించాయి. గురువారం జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ స్మార్ట్ ఫోన్ వివరాలను వెల్లడించారు. 
 
ఇకపోతే, ఈ ఫోన్‌ను రిలయన్స్ జియో, గూగుల్ కలిసి తయారు చేసింది. 4జీ టెక్నాలజీతో తయారైన ఈ ఫోన్... గూగుల్ జియో కోసమే ప్రత్యేకంగా రూపొందించిన ఆప్టిమైజ్డ్ ఆండ్రాయిడ్ ఓఎస్‌ను దీంట్లో ఉపయోగించారు. 
 
రెగ్యులర్ ఆండ్రాయిడ్ అప్ డేట్లను ఇది స్వీకరిస్తుంది. రియాలిటీ ఫిల్టర్స్ కూడిన స్మార్ట్ కెమెరా ఈ ఫోన్‌కు ప్రత్యేకం అని చెప్పాలి. వాయిస్ అసిస్టెంట్, లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్, ఆటోమేటిక్ టెక్ట్స్ రీడ్ అలౌడ్ వంటి ఫీచర్లు ఇందులో ఇన్ బిల్ట్‌గా లభిస్తాయి. అయితే ఈ ఫోన్ ధరను మాత్రం ఈ ఏజీఎం సమావేశంలో వెల్లడించలేదు.