ట్విట్టర్ పిట్టను మించి కూత పెడుతున్న ''కూ'' యాప్.. డేటా లీక్.. జాగ్రత్త..
గత కొద్ది రోజులుగా ట్విట్టర్ పిట్టను మించి కూ యాప్ కూత పెడుతోంది. ట్విట్టర్‌కు పోటీగా కొత్త యాప్ దూసుకొస్తోంది. ట్విట్టర్ ప్రత్యామ్నాయంగా కూ యాప్‌కి డౌన్‌లోడ్లు పెరుగుతున్నాయి. కేంద్రం మేక్ ఇన్ ఇండియా యాప్‌ను ప్రమోట్ చేస్తున్నారు. గత కొద్ది కాలంగా ట్విట్టర్‌కి, కేంద్రానికి మధ్య దూరం పెరిగింది. జనాలను తప్పుదోవ పట్టించేలా ఉన్న 1,100 ట్విట్టర్ ఖాతాలను వెంటనే డిలీట్ చేయాలని కేంద్రం ఇటీవల ట్విట్టర్‌ను కోరింది.
అయితే ముందు ఈ అకౌంట్‌లను బ్లాక్ చేసిన ట్విట్టర్.. సాయంత్రానికి అన్‌బ్లాక్ చేసింది. దీనిపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ట్విట్టర్ యాజమాన్యానికి నోటీసులు పంపింది. దీనిపై ట్విట్టర్ ఇచ్చిన సమాధానం.. ఇప్పుడు వివాదం మరింత ముదిరేలా చేస్తోంది. ప్రభుత్వమిచ్చిన ఆదేశాల్లో కొన్ని భారత చట్టాలకు అనుగుణంగా లేవని ట్విట్టర్ తేల్చి చెప్పింది. ఈ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం పెద్దలు మండిపడుతున్నారు.
ఈ సమయంలో బ్యాన్ ట్విట్టర్ అన్న డిమాండ్ ట్విట్టర్‌లోనే వినిపిస్తోంది. మరోవైపు దీనికి ప్రత్యామ్నాయం వెతుకుతున్నారు. అల్టర్‌నేట్‌గా మేడిన్ ఇండియా యాప్ వైపు చూస్తున్నారు. కూ యాప్‌లో ఖాతాలు ఓపెన్ చేస్తున్నారు. ట్విట్టర్‌ను వదిలి.. క్యూ యాప్‌కి డౌన్‌లోడ్లు పెరుగుతున్నాయి.
గత రెండ్రోజులుగా పది శాతం అధికంగా కొత్త యూజర్లు వచ్చినట్లు చెప్తున్నారు యాప్ నిర్వాహకులు. ప్రస్తుతం యాప్ యూజర్ల సంఖ్య మూడు మిలియన్‌లు దాటింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా ఉన్నారు. పీయూష్ గోయల్ ఇటీవలే కూ యాప్‌ను డౌన్‌లోడు చేసుకున్నట్లు చెప్పారు. మిగతా మంత్రులు అదే బాటలో సాగుతున్నారు. అయితే ఈ యాప్ అంత సేఫ్ కాదని.. సైబర్ నిపుణులు అంటున్నారు.
ట్విట్టర్ యొక్క ఇండియన్ ప్రత్యామ్నాయం అని పిలువబడే కూ యాప్, ఇ-మెయిల్ ఐడి, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీతో సహా చాలా సున్నితమైన యూజర్ డేటాను లీక్ చేసినట్లు కనుగొనబడింది. ఫ్రెంచ్ సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు రాబర్ట్ బాప్టిస్ట్ ఈ యాప్ ఉపయోగించిన తర్వాత ట్వీట్ చేశారు.
వ్యక్తిగత డేటాను ఇది లీక్ చేస్తోంది. ఇ-మెయిల్, పేరు, వైవాహిక స్థితి, లింగం అనే వాటిని లీక్ చేస్తుందని ట్విట్టర్‌లో ఇలియట్ ఆండర్సన్ అనే ప్రసిద్ది చెందిన నిపుణులు గత రాత్రి ట్వీట్ చేశారు.
ట్వీట్లు, మైక్రోబ్లాగింగ్ సైట్‌లో అతను పోస్ట్ చేసిన స్క్రీన్‌షాట్‌ల ప్రకారం, కూ కొన్ని సున్నితమైన వివరాలను లీక్ చేస్తోంది. భారత ప్రభుత్వ విభాగాలు, ఈ సేవలో చేరిన మంత్రుల డేటాతో సహా మిలియన్ల మంది వినియోగదారుల డేటా ఇప్పటికే లీక్ లేదా స్క్రాప్ అయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.