శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By మోహన్
Last Updated : మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (16:50 IST)

టిక్‌టాక్ యాప్‌ను తొలగించండి: గూగుల్, యాపిల్‌కు ఆదేశాలు

టిక్‌టాక్ యాప్‌ను ప్లేస్టోర్‌ల నుండి తొలగించాల్సిందిగా కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గూగుల్‌, యాపిల్‌ సంస్థలను ఆదేశించింది. చైనాకు చెందిన ఈ వీడియో షేరింగ్ యాప్‌పై గత కొద్ది నెలలుగా సర్వత్రా అభ్యంతరం వ్యక్తం అవుతున్న సంగతి విదితమే.


దీంతో దీనిని నిషేధించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ మధురైకి చెందిన సీనియర్ న్యాయవాది, సామాజిక కార్యకర్త ముత్తు కుమార్‌ మద్రాసు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ అంశంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం టిక్‌టాక్‌పై నిషేధం విధించాలని కేంద్రాన్ని ఆదేశించింది. 
 
ఈ యాప్ ద్వారా రూపొందించిన వీడియోలను ప్రసారం చేయకూడదని మీడియాకు సూచించింది. చిన్న పిల్లలు సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా చేపట్టాల్సిన చర్యలపై ఏప్రిల్‌ 16లోగా తమ స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు మేరకు చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం తాజా ఆదేశాలను జారీ చేసింది.
 
అయితే టిక్‌టాక్ సంస్థ మద్రాసు హైకోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం కోర్టు స్టేకు నిరాకరించింది. దీనిపై తదుపరి విచారణను ఏప్రిల్‌ 22న జరుపుతామని తెలిపింది. థర్డ్‌ పార్టీ అప్‌లోడ్‌ చేసే వీడియోలకు తమల్ని బాధ్యులని చేయడం సబబు కాదని టిక్‌టాక్‌ వివరించినట్లు సమాచారం. 
 
యువతకు ఆకట్టుకునే ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన ఈ యాప్‌ తక్కువ కాలంలోనే ఎంతో ఆదరణ పొందింది. ఈ యాప్ వల్ల పిల్లల్లో పెడధోరణులు పెరిగిపోతున్నాయని దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.