మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వాసు
Last Updated : శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (17:34 IST)

ఇకపై గూగుల్‌ పే యాప్‌తోనూ బంగారం కొనేయొచ్చు

వినియోగదారులకు తేజ్ యాప్‌గా పరిచయమై తర్వాతి కాలంలో గూగుల్‌ పే‌గా పేరు మార్చేసుకున్న గూగుల్ పే యాప్‌ తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో... బ్యాంకుల నుండి నగదు బదిలీలకు పేరెన్నికగన్న ఈ యాప్ ద్వారా వినియోగదారులు పసిడి క్రయవిక్రయాలు చేసే సదుపాయాన్ని గూగుల్‌ ఇప్పుడు తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చింది. 
 
వివరాలలోకి వెళ్తే... గూగుల్ పే ద్వారా బంగారం కొనుగోలు చేసే ఈ సదుపాయం కోసం ఆ సంస్థ ఎంఎంటీసీ-పీఏఎంపీ ఇండియాతో జట్టు కట్టింది. ఇప్పటికే పేటీఎం, మొబిక్విక్‌, ఫోన్‌పే యాప్‌లు బంగారం కొనుగోలు, అమ్మకాలు చేసే సదుపాయాన్ని అందిస్తూండగా... ఇప్పుడు గూగుల్‌ పే కూడా ఇదే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రిఫైనరీ సంస్థ ఎంఎంటీసీ-పీఏఎంపీతో ఒప్పందం కుదుర్చుకున్నందు వల్ల గూగుల్‌ పే వినియోగదారులు 99.99 శాతం 24 క్యారెట్‌ బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశం లభిస్తుందని కంపెనీ తెలిపింది. 
 
‘‘బంగారం భారతీయుల సంస్కృతి, సాంప్రదాయంలో ముఖ్యమైనది. అందుకే బంగారం వినియోగంలో భారత్‌ ప్రపంచంలో రెండోస్థానంలో ఉంది. అక్షయ తృతీయ, ధన్‌తేరస్‌ లేదా దీపావళి వంటి పర్వదినాల్లో భారతీయులు బంగారాన్ని అధికంగా కొనుగోలు చేస్తూంటారు’’ అని గూగుల్‌ పే ఇండియా డైరెక్టర్‌ (ప్రొడక్ట్‌ మేనేజర్‌) అంబరీష్‌ కెంఘే ఈ సందర్భంగా తెలియజేసారు. గూగుల్‌ పే వినియోగదారులు తమకు నచ్చినంత బంగారాన్ని కొనుగోలు చేయవచ్చుననీ, దీన్ని వినియోగదారుని తరపున ఎంఎంటీసీ-పీఎఎంపీ సెక్యూర్‌ వాల్ట్స్‌లో స్టోర్‌ చేస్తుందని చెప్పారు. 
 
అయితే.. తగిన అనుమతులు లేకుండా గూగుల్‌ పే ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తోందంటూ బుధవారం ఢిల్లీ హైకోర్టు.. రిజర్వు బ్యాంకును ప్రశ్నించిన విషయమై.. గూగుల్‌ పే కార్యకలాపాలపై సందిగ్ధత నెలకొన్న... మరుసటి రోజే గూగుల్‌ పేలో బంగారం కొనుగోలు చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం ఇక్కడ గమనార్హం. మరి గూగుల్ పే కార్యకలాపాలు ఎంత మేరకు కొనసాగనున్నాయో... ఏమో... ఢిల్లీ హైకోర్టు, ఆర్బీఐలే నిర్ణయించాలి.