బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 జులై 2021 (09:14 IST)

క్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టంలో లోపం - యూజర్లకు హెచ్చరిక

మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో లోపం తలెత్తింది. దీంతో విండోస్ వినియోగదారులందరూ వెంటనే తమ కంప్యూటర్లను అప్‌డేట్ చేసుకోవాలని మైక్రోసాఫ్ట్ విజ్ఞప్తి చేసింది. లేనిపక్షంలో ఈ లోపాన్ని ఆసరాగా చేసుకుని హ్యాకర్లు చెలరేగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 
 
ఈ హ్యాకర్ల బారినపడకుండా ఉండాలంటే వెంటనే అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించింది. విండోస్‌లోని ‘ప్రింట్ స్పూలర్’లో భద్రతా పరమైన లోపాలు ఉన్న విషయాన్ని తాము గుర్తించామని గతేడాది మేలో ‘సాంగ్‌ఫర్’ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రకటించింది. 
 
ప్రింట్ స్పూలర్ అనేది ఒకే ప్రింటర్‌ను ఎక్కువమంది ఉపయోగించుకునేందుకు సాయపడుతుంది. ప్రింట్ స్పూలర్‌లో లోపాలను గుర్తించిన సాంగ్‌ఫర్.. దానిని ఎలా హ్యాక్ చేయొచ్చన్న వివరాలను పొరపాటున ఆన్‌లైన్‌లో పెట్టేసింది. ఆ వెంటనే పొరపాటును గుర్తించి డిలీట్ చేసినప్పటికీ అప్పటికే అది చాలామందికి చేరిపోయింది.
 
‘ప్రింట్ నైట్‌మేర్’గా పిలుస్తున్న ఈ లోపాన్ని హ్యాకర్లు ఉపయోగించుకుని ఇతరుల కంప్యూటర్లలోని డేటాను చూడడం, డిలీట్ చేయడం, కొత్త యూజర్ అకౌంట్లను సృష్టించడం వంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. విండోస్ 10, విండోస్ 7లోనూ ఈ లోపం ఉందని పేర్కొన్న మైక్రోసాఫ్ట్ వీటికోసం అప్‌డేట్‌లను విడుదల చేసింది.
 
వాస్తవానికి విండోస్ 7 అప్‌డేట్స్‌ను ఆపేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ గతేడాదే ప్రకటించింది. అయితే, తాజా లోపం నేపథ్యంలో దానికి కూడా అప్‌డేట్‌ను విడుదల చేసింది. యూజర్లు అందరూ తప్పకుండా అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా హ్యాకర్ల ముప్పు లేకుండా చూసుకోవాలని కోరింది.