శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 జనవరి 2021 (19:42 IST)

వాట్సాప్‌తో వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందా?

భారీ మొత్తం చెల్లించి వాట్సాప్‌ను ఫేస్‌బుక్ సొంతం చేసుకుంది. ఫేస్‌బుక్ తీరును భావ‌ స్వేచ్ఛకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే అమెరికా తప్పుపట్టింది. ఇప్పటికే అధ్యక్షుడు ట్రంప్ ఫేస్‌బుక్ యాజమాన్యాన్ని నిలదీశారు. సోషల్ మీడియాలో పోటీతత్వం లేకుండా చేసేందుకే వాట్సాప్‌ను 'బలవంతంగా' కొనుగోలు చేసిందని విమర్శించారు. చర్యలు తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించారు కూడా.
 
సామాజిక మాధ్యమాల్లో తన స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు తొలి నుంచి అనేక ఫీచర్లను ప్రవేశ పెడుతూ వినియోగదారులకు (యూజర్లకు) వాట్సాప్ మరింత చేరువఅవుతోంది. వాట్సాప్‌కు  భారతదేశం అతిపెద్ద మార్కెట్. ఈ క్రమంలో క్యాష్ లెస్ పేమెంట్ (నగదు రహిత చెల్లింపులు) రంగంలోకి ప్రవేశించేందుకు అనుమతులు సంపాదించింది. త్వరలోనే ఆ సదుపాయం కల్పించేందుకు వాట్సాప్ సమాయత్తం అవుతోంది.
 
 
అందుకోసమే కావొచ్చు కొత్తగా “గోప్యతా విధానం" (ప్రైవసీ పాలసీ) గురించి ఒత్తిడి చేస్తోంది. ఇప్పటికే ఫేస్‌బుక్, వాట్సాప్ రెండూ ఉపయోగించే యూజర్లకు..  ఫేస్‌బుక్‌లో తరచూ ఒక మెసేజ్ జెనరేట్ అవుతోంది. 'మీ వాట్సాప్ నెంబర్‌ను యాడ్ చేయండి' అంటూ ప్రొఫైల్ అప్డేట్ వస్తోంది. దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్‌బుక్ యాజమాన్యం ఇతరులకు విక్రయిస్తోందని గతంలో కూడా విమర్శలు వచ్చాయి. దీనిపై అప్పట్లో ఫేస్‌బుక్ సీఈవోను ఓ దేశ పార్లమెంట్ వివరణ కోరినట్లు వార్తలు కూడా వచ్చాయి. 
 
ఇప్పటివరకు వాట్సాప్‌లో 'ఎండ్ టు ఎండ్ ఎన్‌స్క్రిప్టెడ్' ఫీచర్ ఉండటం వల్ల ప్రైవసీకి భంగం వాటిల్లే అవకాశం లేదని, ఇద్దరి మధ్య జరిగే సమాచార మార్పిడిని (చాటింగ్) ఇతరులు చూడలేరని యాజమాన్యం (ఫేస్‌బుక్) వాదిస్తోంది. అయితే వాట్సాప్ గ్రూపుల్లో ప్రైవసీ అనేది ఉండదని నిపుణులు అంటున్నారు.
 
 
మరోవైపు ఐసిస్, అల్‌ఖైదా సహా పలు తీవ్రవాద సంస్థల కార్యకలాపాల దృష్ట్యా ప్రభుత్వాలు టెలిఫోన్ (సెల్ ఫోన్) ట్యాపింగ్ చేస్తున్నాయి. టెర్రరిజం జాడలేని తెలుగు రాష్ట్రాలలో కూడా స్మార్ట్ ఫోన్ల ట్యాపింగ్ జరుగుతోంది. ఇప్పుడు వాట్సాప్ పై నిఘా కారణంగా భావ స్వేచ్ఛకు భంగం వాటిల్లుతోందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.‌ 
 
 
ఈ క్రమంలో మనవాళ్లు ఫోన్ల నుంచి వాట్సాప్‌ను తొలగించేందుకు సిద్ధం అవుతున్నారు. దీంతో కంగుతిన్న ఫేస్‌బుక్ యాజమాన్యం వాట్సాప్ యూజర్లు జారిపోకుండా చూసుకునేందుకు వాట్సాప్ గోప్యతపై ఇంగ్లీష్ పత్రికలలో పూర్తి పేజీ ప్రకటనలను జారీ చేసింది. వినియోగదారులను నిలుపుకోవటానికి “ఉచిత” సేవే అయితే ఎందుకు అంత భారీగా డబ్బు ఖర్చు చేస్తుంది? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు డేటాను రక్షించడానికి భారతదేశానికి బలమైన నియంత్రణ అవసరం. ఈ విషయంలో ప్రభుత్వం ఏమి చేస్తోందో?