ప్రైవసీ పాలసీపై విమర్శలు.. వివరణ ఇచ్చిన వాట్సాప్
వాట్సాప్ ఇటీవల తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వాట్సాప్ స్పందించింది. తాజా ప్రైవసీ పాలసీలో ఫేస్‌బుక్‌తో డేటా షేరింగ్‌కు సంబంధించిన విషయంలో ఎలాంటి మార్పులూ చేయలేదని వివరణ ఇచ్చింది. టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్, ప్రైవసీ పాలసీని ఇటీవల వాట్సాప్ అప్‌డేట్ చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను యూజర్లకు పంపిస్తోంది.
వాట్సాప్ యూజర్ల డేటా ఫేస్‌బుక్, దాని అనుబంధ సంస్థలతో ఎలా పంచుకునేదీ వివరించింది. నవీకరించిన ప్రైవసీ పాలసీకి యూజర్లు అంగీకారం తెలిపేందుకు ఫిబ్రవరి 8ని గడువుగా నిర్దేశించింది. గడువులోగా అంగీకరించకపోతే తమ యాప్‌ను వినియోగించలేరని వాట్సాప్ పేర్కొంది. ఫేస్‌బుక్‌తో డేటా షేరింగ్ అంశంపై వాట్సాప్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. వ్యక్తిగత సమాచారంపై ఆందోళన మొదలైంది.