ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ప్రీతి
Last Updated : శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (18:11 IST)

వాట్సప్ అలెర్ట్...ఆ పని చేసారో కటకటాల వెనక్కు వెళ్లాల్సిందే...

సోషల్‌ మీడియా ప్రపంచంలో వాట్సప్ ఒక సంచలనమే. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సప్‌ను ఉపయోగిస్తున్నారు. ఇక కొన్ని సాధారణ సెల్ ఫోన్‌లలో కూడా వాట్సప్ సౌలభ్యం ఉంది. వాట్సప్‌తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అంతకంత నష్టాలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నారు. వాట్సప్‌లో ఎవరైనా వేధిస్తే ఇకపై ఫిర్యాదు చేయగల సౌలభ్యాన్ని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికామ్ (డాట్‌) ఏర్పాటు చేసింది. 
 
అంతేకాకుండా అశ్లీలమైన, అభ్యంతరకరమైన సందేశాలకు కూడా అడ్డుకట్ట వేసేలా ఆర్డర్ జారీ చేసింది. వేధింపులు, బెదిరింపులకు పాల్పడితే కస్టమర్ డిక్లరేషన్‌ ఫారమ్‌లో అంగీకరించిన నిబంధనలను ఉల్లంఘించినట్లే. కనుక ఆ కస్టమర్‌లపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని టెలికామ్ సంస్థలు అన్నింటికీ  ఫిబ్రవరి 19న కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. 
 
బాధితులు [email protected]కు ఇమెయిల్ పంపడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చని డాట్‌ కంట్రోలర్‌ ఆశిష్‌ జోషి ట్వీట్‌ చేశారు. అయితే రుజువుగా స్క్రీన్‌షాట్‌లను కూడా ఇవ్వాలి.  ఫిర్యాదులు సంబంధిత టెలికామ్ ప్రొవైడర్‌తో పాటుగా పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లబడతాయి. అభ్యంతరకరమైన, అశ్లీలమైన, అనధికారిక కంటెంట్‌ అలాగే ఉంటే ప్రొవైడర్ల లైసెన్స్‌ను కూడా రద్దు చేస్తామని హెచ్చరించింది. ఇకనైనా తగ్గుతాయేమో చూద్దాం.