శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 జులై 2020 (20:21 IST)

జూమ్‌కు పోటీగా జియో మీట్.. కోర్టుకెళ్తామన్న జూమ్ ఇండియా హెడ్

ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియో సంస్థ.. ఆపై వినియోగదారులను ఆకట్టుకునే రీతిలో ఆఫర్లను ప్రకటిస్తూనే వుంది. ఇప్పటికే కరోనా కారణంగా లాక్ డౌన్ తరుణంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం పలు ఆఫర్లు ప్రకటించిన జియో.. వీడియో కాలింగ్ యాప్‌ను కూడా ప్రవేశపెట్టింది.

గ్రూప్ వీడియో కాలింగ్ యాప్ జూమ్‌కు పోటీగా జియో సంస్థ జియో మీట్ అనే యాప్‌ను తీసుకొచ్చిన తరుణంలో జూమ్ ఇండియా హెడ్ సమీర్ రాజే సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
తమ యాప్‌కు ఎప్పటికైనా పోటీ అప్లికేషన్లు వస్తాయని ముందుగానే అనుకున్నామని, అయితే ఈ విధంగా అచ్చం తమ అప్లికేషన్‌ను పోలి ఉండడం ఆశ్చర్యం కలిగించిందని వ్యాఖ్యానించారు. 'జియో మీట్ అప్లికేషన్‌ను చూసినప్పుడు ఒక్కసారిగా షాక్ అయ్యానని చెప్పారు. ఏ అప్లికేషన్ అయినా ఎప్పుడో ఒకప్పుడు పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. 
 
అయితే ఇలా ఉంటుందని మాత్రం తాను ఊహించలేదు. జియో మీట్ ఇంటర్ఫేస్ మొత్తం మా అప్లికేషన్ ఇంటర్ఫేస్‌తో దాదాపుగా పోలి ఉంది. దీనికి సంబంధించి కోర్టుకెళ్లడంపై అంతర్గత చర్చలు జరుపుతున్నట్లు సమీర్ వెల్లడించారు. అంతేకాకుండా చర్చలు పూర్తయిన అనంతరం జియోపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని తెలిపారు.