శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : శనివారం, 4 మే 2019 (13:57 IST)

మోడీ ఓడిపోతున్నారు.. త్రివిధ దళాలు ఆయన సొంత ఆస్తులా? రాహుల్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. త్రివిధ దళాలను నరేంద్ర మోడీ సొంత ఆస్తులు కావన్నారు. అవి దేశ సంపద అని ఆయన వ్యాఖ్యానించారు. పైగా, ఈ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్తుగా ఓడిపోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. 
 
రాహుల్ శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, త్రివిధ‌ద‌ళాలను ప్ర‌ధాని మోడీ త‌న వ్య‌క్తిగ‌త ఆస్తులుగా భావిస్తున్నార‌ని, అవి ఆయన సొంత ఆస్తులు కావన్నారు. యూపీఏ పాల‌న స‌మ‌యంలో స‌ర్జిక‌ల్ దాడులు చేశామంటే, అవి వీడియోగేమ్‌లో జ‌రిగాయ‌ని మోడీ దేశ ఆర్మీని అగౌరపరిచారని రాహుల్ అన్నారు. తాము మాత్రం ఆ విధంగా మాట్లాడబోమన్నారు. త్రివిధ దళాలకు తాము అత్యున్నత గౌరవం ఇస్తామన్నారు. 
 
ఇకపోతే, దేశంలో నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా మారిపోయిందన్నారు. దీనికి ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను దెబ్బ‌తీయ‌డం వ‌ల్లే ఈ ప‌రిస్థితి వ‌చ్చింద‌ని రాహుల్ ఆరోపించారు. నోట్ల రద్దుతో కోట్లా మంది ప్రజలు అష్టకష్టాలు పడ్డారనీ, జీఎస్టీ వల్ల చిరు వ్యాపారుల తీవ్రంగా నష్టపోయారన్నారు. 
 
గత ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందన్నారు. ఉద్యోగాల గురించి కానీ, రైతుల గురించి కానీ మోడీ ఏమీ మాట్లాడ‌డం లేద‌ని ఆయన మండిపడ్డారు. చౌకీదార్ చోర్‌హై అన్న వ్యాఖ్య‌ల ప‌ట్ల సుప్రీంకోర్టుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన‌ట్టు రాహుల్ అంగీక‌రించారు. 
 
కానీ ఆ వ్యాఖ్య‌ల ప‌ట్ల భారతీయ జనతా పార్టీకి మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమాపణలు చెప్పబోనని తెల్చి చెప్పారు. 'చౌకీదార్ చోర్ హై అన్న‌ది మా నినాదం'గా ప‌నిచేస్తుంద‌న్నారు. మ‌సూద్ అజ‌ర్‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని… కానీ అత‌న్ని ఎవ‌రు విడిచి పెట్టార‌ని రాహుల్ గాంధీ ప్ర‌శ్నించారు.