శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 3 మే 2019 (11:03 IST)

బీజేపీ కార్యాలయాన్ని పేల్చేసిన నక్సల్స్.. ఎక్కడ?

సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్న తరుణంలో నక్సల్స్ దుశ్చర్యలు పెరిగిపోతున్నాయి. ఈనెల ఒకటో తేదీన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గడ్చిరోలిలో మావోయిస్టులు పేల్చిన మందుపాతరకు 16 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల కార్యాలయాన్ని పేల్చివేశారు. 
 
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సారైకేలా జిల్లా, కుంతీ లోక్‌సభ పరిధిలోని కర్సవాన్‌లోని బీజేపీ ఎన్నికల కార్యాలయాన్ని నక్సలైట్లు పేల్చి వేశారు. గురువారం అర్థరాత్రి 12.30 గంటల సమయంలో పార్టీ కార్యాలయం వద్దకు వచ్చిన నక్సల్స్, కేన్ బాంబులను ఉపయోగించి పార్టీ ఆఫీస్‌ను పేల్చి వేశారు.
 
కుంతి లోక్‌సభ స్థానం నుంచి జార్ఖండ్ మాజీ సీఎం అర్జున్ ముండా బీజేపీ తరఫున పోటీలో ఉన్నారు. కుంతితో పాటు కోడెర్మా, రాంచీ నియోజకవర్గాల్లో నేడు అమిత్ షా ఎన్నికల ర్యాలీలను నిర్వహించాల్సి వుంది. ఐదో విడత ఎన్నికల్లో భాగంగా 6వ తేదీన ఇక్కడ పోలింగ్ జరగనున్న విషయం తెల్సిందే.