బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. లోక్ సభ ఎన్నికలు 2024
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (11:56 IST)

లోక్‌సభ ఎన్నికలు : తెలంగాణాలో రూ.202 కోట్ల నగదు స్వాధీనం

Cash
తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఈ నెల 13వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు వీలుగా పంపిణీ చేసేందుకు అక్రమంగా తరలిస్తున్న డబ్బును ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ గుర్తించి సీజ్ చేసింది. ఈ క్రమంలో ఇప్పటివరకు మొత్తం రూ.202 కోట్ల విలువైన నగదుతో పాటు ఇతర సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. 
 
లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఇప్పటివరకు రూ.202 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకోగా, ఇందులో రూ.76.65 కోట్ల నగదును, రూ.43.57 కోట్ల మద్యం, రూ.29.62 కోట్ల విలువైన 118 కిలోల బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. అలాగే రూ.26.54 కోట్ల విలువైన 13.86 లక్షల వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
 
మరోవైపు, సోమవారం హైదరాబాద్ నగరంలో రూ.1,96,70,324 నగదును సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. సైబరాబాద్‌లోని వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బందితో కలిసి ఎనిమిది ప్రదేశాల్లో ఈ నగదును పట్టుకున్నారు. బ్యాంకులకు నగదు తీసుకువెళ్లే 7 వాహనాలలో రూ.1,81,70,324 నగదు పట్టుబడింది. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా సరైన డాక్యుమెంట్లు లేకుండా తరలిస్తున్న నగదును సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అత్యధికంగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.74 లక్షలకు పైగా పట్టుకున్నారు.