బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. లోక్ సభ ఎన్నికలు 2024
Written By ఠాగూర్

ఎయిర్‌ఫోర్స్ మాజీ చీఫ్ మార్షల్ ప్రదీప్ నాయక్‌‌కు షాక్.. భార్య ఓటు గల్లంతు...

vote
భారత వైమానికదళం మాజీ అధిపతి ప్రదీప్ వసంత్ నాయక్‌కు అనూహ్య పరిణామం ఎదురైంది. సోమవారం ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లగా ఆయన సతీమణి ఓటు గల్లంతైంది. దీంతో ఆయన ఒకింత షాక్‌కు గురై అసహనం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా సోమవారం ఉదయం 7 గంటల నుంచి నాలుగో విడత పోలింగ్ జరుగుతున్న విషయం తెల్సిందే.
 
ఈ సమయంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రదీప్ వసంత్ నాయక్‌, తన సతీమణి, కుమారుడితో కలిసి మహారాష్ట్రలోని పుణెలో వున్న పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. నాయక్‌, తన కుమారుడు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఆయన భార్య పేరు ఓటర్ల జాబితాలో లేదని తెలిసి ఆశ్చర్యపోయారు. వెంటనే ఈ విషయాన్ని అక్కడి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు తాము ఏమీ చేయలేమని చెప్పారన్నారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ 'ఓటర్ల జాబితాలో భార్య పేరు లేకపోవడంతో మేం అసంతృప్తికి గురయ్యాం. అక్కడ మరికొందరికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇలా కొందరి పేర్లు జాబితా నుంచి ఎందుకు డిలీట్ అయ్యాయో గుర్తించాలి. మా వద్ద స్థానిక నేతలు ఇచ్చిన ఓటర్ స్లిప్స్‌ కూడా ఉన్నాయి. అవి తీసుకెళ్లినా ఉపయోగం లేకపోయింది' అని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
 
కాగా, దేశవ్యాప్తంగా నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో భాగంగా 10 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 96 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 543 స్థానాలకు గానూ ఇంతవరకు మూడు దశల్లో 283 సీట్లకు పోలింగ్‌ పూర్తయింది. నాలుగో దశతో అది 379కి చేరుతుంది.