శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2020 (17:32 IST)

14 ఏళ్ల బాలిక గర్భం ధరించింది.. అంతే కన్నతండ్రి, అన్నయ్య కలిసి..?

పరువు హత్యలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలోనూ పెరిగిపోతున్నాయి. తాజాగా నేరాలకు అడ్డాగా మారిపోతున్న ఉత్తరప్రదేశ్‌లో కన్నతండ్రి, సోదరుడు కలిసి 14ఏళ్ల దళిత బాలికను హతమార్చారు. దీనికి కారణం ఆమె ప్రేమ పేరుతో గర్భం దాల్చడమేనని పోలీసులు తెలిపారు. 14 ఏళ్ల బాలిక పరువు హత్యకు సోదరుడు కూడా సాయం చేశాడని విచారణలో తేలింది. దళిత బాలిక గర్భానికి కారణం ఎవరనే విషయాన్ని బహిర్గతం చేసేందుకు కూడా వాళ్లిద్దరూ నిరాకరించారు. 
 
వివరాల్లోకి వెళితే.. సిధౌలి ప్రాంతంలోని దుల్హాపూర్ గ్రామంలో గ్రామస్తులు తల నరకబడిన బాలిక మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మంగళవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో హతురాలు ఆరు నెలల గర్భవతి అని తెలిసింది. ప్రేమ కారణంగా ఆమె గర్భం దాల్చిందని.. పరువు కారణంగా ఆమెను హతమార్చినట్లు హతురాలి తండ్రి ద్వారా తెలిసింది.
 
సెప్టెంబర్ 24 న బాలిక హత్యకు గురైందని, అయితే కుటుంబం పోలీసులను ఆశ్రయించలేదు. ప్రేమ కారణంగా పెళ్లికి ముందే గర్భం దాల్చడంతోనే బాలికను గొంతు కోసి చంపేసినట్లు తేలింది. ఆపై కాలువ వద్ద ఆమె మృతదేహాన్ని పారేసినట్లు నిందితుడైన తండ్రి ఒప్పుకున్నాడు. 
 
ఈ హత్యకు బాలిక అన్నయ్య కూడా సహకరించాడని పోలీసులు తెలిపారు. దీంతో వారిద్దరిపై ఐపీసీ సెక్షన్ 302, 201 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇంకా బాలిక గర్భధారణకు కారణమైన వ్యక్తిని గుర్తించడానికి కూడా  ప్రయత్నిస్తున్నామని, ఈ విషయంలో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.