శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

మహారాష్ట్రలో లాక్డౌన్ : సొంతూళ్ళకు క్యూ కట్టిన కూలీలు.. ఆర్సెస్ చీఫ్‌కు కరోనా

మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి చేయిదాటిపోయింది. ఈ ఒక్క రాష్ట్రంలోనే పరిస్థితి అదుపుతప్పింది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా కఠిన లాక్డౌన్‌ విధిస్తామని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే శనివారం వర్చువల్‌గా జరిగిన అఖిలపక్ష సమావేశంలో వ్యాఖ్యానించినట్టు వార్తలు గుప్పుమన్నాయి. లాక్డౌన్‌ స్వభావం, పరిధి, ఎన్నాళ్లు అమలు చేయాలన్న అంశాలను త్వరలో ఖరారు చేస్తామని మంత్రి అశోక్‌ చవాన్‌ పేర్కొన్నారు. ఈ లాక్డౌన్ కూడా 15 రోజుల పాటు అమలు చేసే అవకాశం ఉంది.
 
నిజానికి మహారాష్ట్రలో తొలి వారాంతపు లాక్డౌన్‌ అమల్లోకి వచ్చింది. లాక్డౌన్‌తో ముంబై, పుణె తదితర నగరాల్లో వీధులు, మార్కెట్లు నిర్మానుష్యంగా మారాయి. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా నాలుగో దశ విజృంభణ నేపథ్యంలో మరిన్ని ఆంక్షలు విధించనున్నట్టు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. 
 
అయితే లాక్డౌన్‌ విధించబోమని చెప్పారు. తమకు తగినన్ని వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులో ఉండి, వ్యాక్సినేషన్‌కు వయోపరిమితి తొలగిస్తే వచ్చే 2-3 నెలల్లో ఢిల్లీ ప్రజలందరికీ వ్యాక్సిన్‌ వేస్తామని ప్రధానికి లేఖ రాసినట్టు చెప్పారు. 
 
కరోనా కట్టడికి కర్ణాటకలోని పలు జిల్లాల్లో శనివారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. రాజధాని బెంగళూరుతోపాటు మైసూరు, మంగళూరు, కల్బుర్గి, బీదర్‌, తుమకూరు, ఉడుపి-మణిపాల్‌లో శనివారం నుంచి ఈ నెల 20వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. 
 
కరోనా ఉద్ధృతి కారణంగా చెన్నైతో పాటు సమీప జిల్లాల్లోని బీచ్‌లకు శని, ఆదివారాలతో పాటు సెలవు దినాల్లో అనుమతించబోమని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.
 
కాగా, ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌కు కరోనా సోకింది. ఆయనను నాగ్‌పూర్‌లోని కింగ్స్‌వే దవాఖానలో చేర్పించినట్టు ఆరెస్సెస్‌ తెలిపింది. ఆయన మార్చి 7న కరోనా టీకా తొలిడోసు తీసుకొన్నారు.