శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 మే 2020 (22:47 IST)

జూన్ 1 నుంచి రైళ్ళు - బస్సుల రాకపోకలు

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం గత రెండున్నర నెలలుగా అమలు చేస్తూ వచ్చిన లాక్డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. కేవలం కంటైన్మెంట్లలో మాత్రం లాక్డౌన్ ఆంక్షలు అమలు చేయనున్నారు. నిజానికి జూన్ 30 వరకు లాక్డౌన్ ఆంక్షలు పొడగించినప్పటికీ.. అనేక ఆంక్షలను తొలగించింది. 
 
ఈ నేపథ్యంలో జూన్‌ 30 వరకు లాక్డౌన్‌ను పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో కట్టడి ప్రాంతాలకే లాక్డౌన్‌ వర్తిస్తుందని ప్రకటించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతోందని తెలిపింది. అంతర్రాష్ట్ర రాకపోకలపై నిషేధం ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 
 
కాగా లాక్డౌన్ సీఎస్, డీజీపీ, అధికారులతో సమీక్షించిన సీఎం కేసీఆర్.. కేంద్రం సూచించిన సడలింపులు అమలు చేస్తామని చెప్పారు. కంటైన్‌మెంట్ జోన్లలో కఠినంగా లాక్‌డౌన్‌ను నిర్వహిస్తామన్నారు. షాపులు రాత్రి 8 వరకు తెరిచి ఉంచుకోవచ్చని, ఆ తర్వాత అనుమతి ఉండదని తెలిపారు. ఇతర రాష్ట్రాల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలులేవని కేసీఆర్ స్పష్టం చేశారు. 
 
 
ఇకపోతే, లాక్డౌన్ 5.0 ప్రకటించినప్పటికీ.. ఆంక్షలు కంటైన్మెంట్ జోన్లకే పరిమితం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజా రవాణా కూడా గాడిన పడనుంది. అందులో భాగంగా.. జూన్ 1 నుంచి.. అంటే రేపటి నుంచి దేశవ్యాప్తంగా 200 ప్రత్యేక రైళ్లు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చనున్నాయి. 
 
ఈ రైళ్లలో ప్రయాణించాలంటే టికెట్ రిజర్వేషన్ తప్పనిసరి. ఏసీ, నాన్ ఏసీ కోచ్‌లతో రైళ్లు నడవనున్నాయి. జనరల్ కోచ్‌ల్లో ప్రయాణించాలన్న రిజర్వేషన్ టికెట్ ఉండాల్సిందే. టికెట్ ధర గతంలో మాదిరిగానే ఉంటుందని రైల్వే శాఖ ప్రకటించడం కొంత ఊరట కలిగించే విషయం. ఈ రైళ్ళలో తొలి రోజు ఏకంగా 1.45 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించనున్నారు. 
 
మే 21, ఉదయం 10 గంటల నుంచి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణం చేయాలంటే రైలు బయలుదేరే సమయానికి కనీసం 90 నిమిషాల ముందే రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. రైల్వే స్టేషన్ల వద్ద ప్రయాణికులందరికీ థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరిగా చేస్తారు. ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేని వారినే ప్రయాణించడానికి అనుమతిస్తారు.