శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 నవంబరు 2020 (23:03 IST)

భారత సైన్యంలో కమాండ్ హోదాలో మహిళలు.. 422మంది అర్హులే!

women Army officers
భారత సైన్యంలో మహిళలకు చోటు దక్కనుంది. భారత సైన్యంలో కమాండ్‌ హోదాలో మహిళలు పనిచేయడానికి అర్హులేనని, అలాగే సైన్యంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ ఏర్పాటుచేయాలని సుప్రీంకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆదేశాలు జారీ చేసింది. ఇంతకు ముందున్న నిబంధనల ప్రకారం, మహిళలకు పర్మినెంట్‌ కమిషన్‌ లేదు. 
 
14 ఏళ్ల సర్వీస్‌ పూర్తిచేసుకున్న మహిళలంతా కూడా ఉద్యోగ విరమణ చేయాల్సిందే. ఈ అంశంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సుప్రీం ఆదేశాల అనుసారం మహిళల పర్మినెంట్‌ కమిషన్‌కు అర్హుల్ని ఎంపికచేసే బాధ్యత స్పెషల్‌ సెలక్షన్‌ బోర్డ్‌కు అప్పజెప్పారు. సైన్యంలోని 10 విభాగాల్లో పనిచేస్తున్న మహిళా అధికారుల్ని పర్మినెంట్‌ కమిషన్‌కు ఎంపికచేసింది.
 
ఇలా ఏర్పాటైన స్పెషల్‌ సెలక్షన్‌ బోర్డ్‌ జరిపిన పరిశీలనతో 70శాతం మంది మహిళా సైనిక అధికారులు పర్మినెంట్‌ కమిషన్‌కు అర్హులేనని, వారు భారత సైన్యంలో పూర్తికాలం పనిచేయగలరని శుక్రవారం ఆర్మీ ఒక ప్రకటన విడుదల చేసింది. పర్మినెంట్‌ కమిషన్‌కు 615మంది మహిళా సైనిక అధికారుల్ని పరిశీలించగా, అందులో 422మంది అర్హులని బోర్డు తేల్చింది. తద్వారా ఇప్పుడు వీరంతా రిటైర్మెంట్‌ వయస్సు వచ్చేంత వరకు ఆర్మీలో పనిచేసే అవకాశం లభించింది.