ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

సుప్రీంకోర్టు సీజేఐకు న్యాయవాదుల లేఖ.. అందులో ఏముంది?

supreme court
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌కు అనేక మంది న్యాయవాదులు కలిసి లేఖ రాశారు. ఇందులో అనేక అంశాలను వారు ప్రస్తావించారు. ముఖ్యంగా, రాజకీయ నేతలకు సంబంధించిన కేసుల్లో కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు కొన్ని స్వార్థశక్తులు ఒత్తిడి వ్యూహాలను అమలు చేస్తున్నాయని వారు పేర్కొన్నారు. కోర్టులపై ప్రజల విశ్వాసాన్ని తగ్గించేందుకు కీలక తీర్పులపై తప్పుడు కథనాలు సృష్టిస్తున్నాయని న్యాయవాదులు రాసిన లేఖలో పేర్కొన్నారు. 
 
వ్యక్తిగత, రాజకీయ కారణాలతో కోర్టు ప్రతిష్ఠను దెబ్బతీసే ఇలాంటి ప్రయత్నాలను అనుమతించవద్దని, ఇలాంటి వాటిపై మౌనంగా ఉంటే హాని చేయాలనుకునే వారికి మరింత బలం ఇచ్చినట్లవుతుందన్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరుతున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ రాసిన వారిలో హరీశ్ సాల్వే సహా పలువురు ఉన్నారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ 600 మందికి పైగా లాయర్లు ఈ లేఖను రాశారు. 
 
ఈ లేఖపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఇతరులను వేధించడం... బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి అని విమర్శించారు. ఐదు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ కేంద్రానికి కట్టుబడి ఉండే న్యాయవ్యవస్థ కోసం పిలుపునిచ్చిందన్నారు. స్వార్థప్రయోజనాల కోసం ఇతరుల నుంచి నిబద్ధతను కోరుకుంటారని... కానీ దేశంపై ఎలాంటి నిబద్ధత చాటుకోరని విమర్శించారు. 140 కోట్ల మంది భారతీయులు వారిని ఎందుకు దూరం పెడుతున్నారో ఎవరూ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు.