పాటలు వింటున్న బాలికపై చిరుత దాడి, అడవిలోకి లాక్కెళ్లి...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అటవీ ప్రాంతానికి సంబంధించిన కనాకౌన్ గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక తన ఇంటి సమీపంలో పెరటి తోటలో చెవిలో హెడ్ ఫోను పెట్టుకుని పాటలు వింటోంది. ఈ సమయంలో అక్కడికి చిరుతపులి ప్రవేశించింది. పులి రాకను ఆ బాలిక గమనించలేదు. దీనితో అది ఆమెపై దాడి చేసి నోట కరచుకుని అటవీ ప్రాంతంలోకి ఎత్తుకెళ్లి చంపేసింది.
బాలికను పులి ఎత్తుకెళ్లిందన్న సమాచారాన్ని అందుకున్న అటవీ అధికారులు సమీపంలో గాలించారు. తీవ్ర గాలింపు అనంతరం ప్రక్కనే వున్న ముళ్లపొదలో ఆమె శవాన్ని గుర్తించారు. బాలిక చెవిలో హెడ్ ఫోన్ వుండటం వల్ల చిరుత రాకను గుర్తించలేకపోయి వుంటుందని, అందువల్లనే ఈ ప్రమాదానికి కారణమై వుండవచ్చని వారు తెలిపారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
బాలిక కుటుంబ సభ్యులకు యూపీ సీఎం సానుభూతి తెలిపారు. కాగా గత నెల రోజుల కాలంలో చిరుతపులి 8 మందిని పొట్టనబెట్టుకుంది. ఈ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు పలుచోట్ల వలలు వేశారు. ఐనప్పటికీ చిరుత ఇప్పటివరకూ పట్టుబడలేదు.