శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (15:04 IST)

ఆధార్ ఉంటేనే అంత్యక్రియలు : బెగంళూరు కార్పొరేషన్ షరతు

కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో ఓ వింత పరిస్థితి నెలకొంది. బృహత్ బెంగుళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) అధికారులు సరికొత్త నిబంధన విధించారు. బీబీఎంసీ పరిధిలో చనిపోయేవారికి దహన సంస్కారాలు చేయాలంటే విధిగా ఆధార్ కార్డు ఉండాలన్న షరతు విధించారు. ఈ నిర్ణయంతో బెంగుళూరు నగర వాసులు షాక్‌కు గురయ్యారు. పైగా, బీబీఎంపి ఆధ్వర్యంలో పనినడుస్తున్న శ్మశానాల్లో దహనం చేసేందుకు అనుమతించని పరిస్థితి తాజాగా వెలుగుచూసింది. 
 
ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు పొందటానికి ఆధార్ కార్డు తప్పనిసరి అని సుప్రీం కోర్టు స్పష్టంచేసినా, బెంగళూరు నగరంలో మాత్రం శవ దహనానికి కూడా ఆధార్‌ను తప్పనిసరి చేసింది. అంటే మృతులకు ఆధార్ లేకుంటే వారి ఆత్మ కూడా శాంతించదని బీబీఎంపి అధికారులు అంటున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నా అధికారులు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. 
 
తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగళూరు నగరంలోని విజయనగర్‌కు చెందిన రాజేష్ అనే ఓ యువకుడి మేనత్త మరణించడంతో ఆమె మృతదేహానికి అంత్యక్రియలు జరిపేందుకు కుటుంబ సభ్యులతో కలిసి సుమనహళ్లి మున్సిపల్ శ్మశానవాటికకు తీసుకువచ్చాడు. శ్మశానవాటిక సిబ్బంది శవ దహనానికి అభ్యంతరం చెప్పారు. 
 
అంత్రక్రియలు చేయాలంటే మృతురాలి ఒరిజినల్ ఆధార్ కార్డు కావాలని, ఆ నంబరుతో ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేయాలని కోరారు. మృతురాలి పేరిట ఉన్న ఆధార్ కార్డు పోవడంతో సమీపంలోని నెట్ సెంటరుకు వెళ్లి ఈఆధార్ కోసం ప్రయత్నిస్తే రిజిస్టరు మొబైల్ నంబరు సిమ్ బ్లాక్ అయిందని గుర్తించాం. దీంతో మరో మొబైల్ నంబరుతో ఈ ఆధార్ తీసుకువచ్చాకే మున్సిపల్ అధికారులు శవదహనానికి అనుమతించారు. 
 
బెంగళూరు మహానగర పాలిక అధికారులు నగరంలో 46 శ్మశానవాటికలు నిర్వహిస్తున్నారు. ఆధార్ కార్డు ఉంటేనే తాము శ్మశానవాటికలో శవదహనానికి అనుమతిస్తామని మహానగర పాలిక అధికారులు చెప్పడంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.