సౌర కుటుంబం అధ్యయనం కోసం ఆదిత్య ఎల్-1 ప్రయోగం.. ముహూర్తం ఫిక్స్
సౌర కుటుంబ అధ్యయనం కోసం ఆదిత్య ఎల్-1 పేరుతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ నెల 23వ తేదీన చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3ని విజయవంతంగా దించింది. ఫలితంగా అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్రను లిఖించింది. ఇపుడు అదే ఉత్సాహంతో సూర్యుడి రహస్యాలను తెలుసుకునేందుకు ఇస్రో సిద్ధమైంది. ఇందుకోసం సెప్టెంబరు 2వ తేదీన ఆదిత్య-ఎల్ 1 ప్రయోగం చేపట్టనుంది. ఈ విషయాన్ని ఇస్రో అధికారి ఒకరు వెల్లడించారు.
'సెప్టెంబరు 2న ఈ ప్రయోగం చేపట్టే అవకాశాలున్నాయి' అని సదరు అధికారి తెలిపారు. ఇప్పటికే ఈ ఉపగ్రహాన్ని శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)కు తీసుకొచ్చారు. పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహకనౌక.. ఆదిత్య-ఎల్ 1ను మోసుకుని నింగిలోకి దూసుకెళ్లనుంది. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో ఇస్రో సౌర అధ్యయన ప్రక్రియను చేపట్టనుంది.
కాగా, సౌర కుటుంబ అధ్యయనం కోసం ఇస్రో చేపడుతున్న తొలి మిషన్ ఇది. 1500 కిలోల బరువున్న శాటిలైట్‌ను నింగిలోకి పంపించనుంది. భూమి నుంచి సూర్యుని దిశగా 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్ పాయింట్ 1 (ఎల్ 1) చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ కక్ష్యలోకి పంపించడం ద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు లభిస్తుంది.